ప్రియురాలి బలవన్మరణానికి కారకుడైన వ్యక్తి అరెస్టు
eenadu telugu news
Updated : 23/09/2021 12:10 IST

ప్రియురాలి బలవన్మరణానికి కారకుడైన వ్యక్తి అరెస్టు

పెదకాకాని, న్యూస్‌టుడే: ప్రియుడి ప్రవర్తన కారణంగా ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడ్ని బుధవారం అరెస్టు చేసినట్టు సీఐ సురేష్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం కొల్లిపర మండలం పిడపర్రుకి చెందిన వి.మానస(26), సీతయ్య దంపతులు బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు నగరానికి వచ్చారు. భర్త పెయింటు పనిచేసి కుటుంబాన్ని పోషించేవారు. ఆదిత్యనగర్‌కి చెందిన దాసి సంతోష్‌ అలియాస్‌ జోసఫ్‌ అనే ఆటోడ్రైవర్‌ మానసకు పరిచయమయ్యాడు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త 2019లో పురుగుల మందు తాగి మృతిచెందారు. అనంతరం ఆమె పిడపర్రు వెళ్లారు. అక్కడ కూడా వారు తమ సంబంధాన్ని కొనసాగించారు. ఏడు నెలల క్రితం సంతోష్‌ ఆమెను పెదకాకానిలోని యాదవపాలేనికి తీసుకొచ్చి, అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. అయితే సంతోష్‌ మరో మహిళతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మానసకు తెలిసి, అతన్ని ప్రశ్నించింది. అతను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆమెను పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె ఈనెల 18న ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈమెకు ఓ పాప ఉంది. ఈమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని