పరిమితంగానే అనుమతి
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

పరిమితంగానే అనుమతి

రోజుకు 4వేల మందికి ఉచిత దర్శనం

3వేల చొప్పున రూ.100, 300 టిక్కెట్ల జారీ

ఈనాడు, అమరావతి: దుర్గగుడిలో దసరా ఉత్సవాలను గత ఏడాదిలాగే పరిమిత సంఖ్యలో భక్తులతో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన మొదటి సమన్వయ సమావేశాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఉత్సవాల్లో ఏఏ ఏర్పాట్లు చేయాలి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాల క్యూలైన్లు, చెప్పుల స్టాండ్లు, రవాణా, విధుల్లో పాల్గొనాల్సిన సిబ్బంది, ప్రసాదాల తయారీ.. సహా అన్ని అంశాలపైనా చర్చించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దేవాదాయశాఖ కమిషనరు వాణిమోహన్‌, కలెక్టర్‌ నివాస్‌, సీపీ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, దుర్గగుడి ఈవో భ్రమరాంబ సహా ఉన్నతాధికారులు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల నిర్వహణలో పాల్గొనే దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, జలవనరులు, అగ్నిమాపక, మత్స్య, సమాచార, రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.

టిక్కెట్లు: రోజుకు 10వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. వీరిలో 4వేల మందికి ఉచిత దర్శన టిక్కెట్లు జారీ చేస్తారు. 3వేల మందికి రూ.100, మరో 3వేలకు రూ.300 టిక్కెట్లను విక్రయిస్తారు. ఈ టిక్కెట్లు అన్నీ ఆన్‌లైన్‌లో https:///aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. గురువారం 600 మంది వరకు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తీసుకున్నారు.

ప్రసాదాలు: దసరా ఉత్సవాల్లో భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజులకు పది లక్షల లడ్డూలను తయారు చేయాలని నిర్ణయించారు. రోజుకు అనుమతించే భక్తుల సంఖ్య పరిమితంగానే ఉండడంతో ప్రసాదాలను సైతం గతంలో కంటే తక్కువగా అందుబాటులో ఉంచుతున్నారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రి వెలంపల్లి, కలెక్టర్‌ నివాస్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ వాణిమోహన్‌, సీపీ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, మేయర్‌ భాగ్యలక్ష్మి, పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు

ప్రత్యేక పూజలు: గత ఏడాది ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసారి ప్రతక్ష్యంగా, పరోక్షంగా పూజలను నిర్వహించాలని నిర్ణయించారు. దసరాలో లక్ష కుంకుమార్చన పూజకు రూ.3వేలు, మూలానక్షత్రం రోజున మాత్రం రూ.5వేల టిక్కెట్‌ ధర నిర్ణయించారు. చండీహోమానికి రూ.4వేలు, శ్రీచక్ర నవార్చనకు రూ.3వేల టిక్కెట్‌ ధర పెట్టారు. ఈ టిక్కెట్లు కూడా ఆన్‌లైన్‌లో https:///aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక పూజల కోసం వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కొండ దిగువ నుంచి ఏర్పాటు చేస్తారు. భక్తుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ ద్వారా దీనికి సంబంధించిన సమాచారం అందజేస్తారు.

క్యూలైన్లు: కొండ కింద వినాయక ఆలయం, మరోవైపున కుమ్మరిపాలెం నుంచి భక్తులు మూడు క్యూలైన్లలో కొండపైకి చేరుకుంటారు. ఓం టర్నింగ్‌ వద్ద నుంచి ఐదు లైన్లుగా మారిపోతారు. క్యూలైన్లలో వచ్చేటప్పుడే భక్తులకు థర్మల్‌ స్కానర్లతో టెంపరేచర్‌ పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగులను దర్శనాలకు తీసుకొచ్చేందుకు వలంటీర్ల సేవలను వినియోగించనున్నారు.

ఊరేగింపు: ఊరేగింపులన్నీ ఆలయ ప్రాంగణానికే పరిమితం చేయాలని నిర్ణయించారు. భక్తులు ఎక్కువగా ఒకేచోటికి చేరేందుకు అవకాశం ఉండడం వల్ల గతంలోలా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అట్టహాసంగా చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు.

వైద్య శిబిరాలు: అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో తొమ్మిది వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన ఆలయం వద్ద ఓ అంబులెన్సు అందుబాటులో ఉంటుంది. కొవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే తరలించేందుకు వీలుగా ఐసోలేషన్‌ పాయింట్‌ను కూడా ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య విభాగానికి సూచించారు.

భక్తులకు సౌకర్యాలు: క్యూలైన్లలో మంచినీటి సౌకర్యం, చిన్న పిల్లల కోసం పాలను అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు వచ్చే దారి పొడుగునా.. మూత్రశాలలు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచుతారు. దేవస్థానం, నగరపాలక సంస్థ కలిసి 230 తాత్కాలిక మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.


అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

-భ్రమరాంబ, దుర్గగుడి ఈవో

క్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను పక్కాగా చేపడతాం. సమన్వయ సమావేశంలో నిర్ణయించిన మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తాం. దర్శనాలు, ప్రత్యేక పూజలకు సంబంధించిన టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతాం. క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా నీరు, పాలు అందజేస్తాం.


భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించాలి

-జె.నివాస్‌, కలెక్టర్‌

మ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తప్పనిసరిగా మాస్కు ఉండాలి. దసరా ఉత్సవాల్లో సేవలు అందించేందుకు అన్ని విభాగాల సిబ్బందిని మూడు షిఫ్టుల్లో నియమించాలి. నిర్వహణలో పాల్గొనే సిబ్బంది కోసం 50వేల మాస్కులను దేవస్థానం సిద్ధం చేసి ఉంచుతుంది. కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించం. దర్శనాల కోసం వచ్చే వీఐపీ భక్తుల కోసం ప్రత్యేకంగా 15 వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని