‘హెరాయిన్‌ రవాణా గుట్టు విప్పండి’
eenadu telugu news
Updated : 24/09/2021 03:37 IST

‘హెరాయిన్‌ రవాణా గుట్టు విప్పండి’


నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు 

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : కేంద్ర ప్రభుత్వం హెరాయిన్‌ రవాణా గుట్టు విప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు డిమాండ్‌ చేశారు. మాదకద్రవ్యాల నుంచి యువతను కాపాడాలని, హెరాయిన్‌ రవాణాపై కేంద్రం విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని కోరుతూ గురువారం సీపీఎం విజయవాడ కమిటీ ఆధ్వర్యంలో 2కే వాక్‌ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని సీఐటీయూ కార్యాలయం నుంచి సత్యనారాయణపురం శివాజీ కేఫ్‌ వరకు నిర్వహించాలని భావించగా, పోలీసులు అనుమతించలేదు. దీంతో బీఆర్‌టీఎస్‌ రోడ్డులోనే నిరసన వ్యక్తం చేశారు. బాబూరావు మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన హెరాయిన్‌ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి సన్నిహితుడైన ఆదానీ కంపెనీ ఆధ్వర్యంలో ముంద్రా పోర్టులో గుర్తించిన మాదకద్రవ్యాల అంశంపై కేంద్రం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గతంలో దొడ్డిదారిన మాదక ద్రవ్యాల రవాణా సాగేదన్నారు. కానీ భాజపా పాలనలో పోర్టుల ప్రైవేటీకరణ అనంతరం రాజమార్గంలో సాగటం ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణా, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.కాశీనాథ్‌, సీపీఎం నగర నాయకులు బి.రమణరావు, టి.ప్రవీణ్‌, ఝాన్సీ, సుబ్బారావు, ఆర్‌.కోటేశ్వరరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సీఎం, డీజీపీ నోరు విప్పాలి

నందిగామ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రూ.వేల కోట్ల హెరాయిన్‌ రవాణాకు సంబంధించి ముఖ్యమంత్రి, డీజీపీ నోరు విప్పి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా యువతను మత్తులో ఉంచేందుకు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని, దీని మూలాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ అధికార పెద్దలు నోరు విప్పకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న బిగ్‌బాస్‌ ఎవరో కేంద్ర నిఘా సంస్థలు నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. కృష్ణాజిల్లా నందిగామ తెదేపా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి దానికి ట్వీట్‌లు చేసే విజయసాయిరెడ్డి ఈ విషయంలో ఎందుకు నోరు విప్పట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో పోర్టులన్నీ రెండున్నరేళ్లలో ఆంధ్రా వాళ్ల చేతుల్లో నుంచి ఇతర రాష్ట్రాల వారికి వెళ్లిపోవడంలో మర్మం ఏమిటో చెప్పాలన్నారు. కాకినాడు పోర్టు నుంచి పెద్దఎత్తున రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి అక్రమరవాణా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మాఫియాకు అడ్డాగా మార్చారని విమర్శించారు. సుబాబుల్‌కు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటల బీమా పథకం అందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నా సీఎం జగన్‌రెడ్డి స్పందించట్లేదని విమర్శించారు. టన్ను సుబాబుల్‌కు రూ.వెయ్యి కూడా రావట్లేదని, దీనిపై త్వరలో పాదయాత్ర చేస్తామని ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని