కొలువుదీరిన కొత్త జడ్పీ
eenadu telugu news
Updated : 26/09/2021 06:07 IST

కొలువుదీరిన కొత్త జడ్పీ

ఛైర్‌పర్సన్‌గా ఉప్పాల హారిక ప్రమాణం
అట్టహాసంగా సభ్యుల ప్రమాణ స్వీకారం
వైస్‌ ఛైర్‌పర్సన్లుగా కృష్ణంరాజు, శ్రీదేవి
ఈనాడు - అమరావతి
జడ్పీ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్లతో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్యేలు

అందరూ ఊహించినట్లే జడ్పీ పీఠాన్ని గుడ్లవల్లేరు జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాల హారిక అధిష్ఠించారు. శనివారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. తొలుత సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ప్రిసైడింగ్‌ అధికారిగా కలెక్టర్‌ నివాస్‌ వ్యవహరించారు. ఆయన జడ్పీటీసీ సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణస్వీకారం చేయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఎన్నిక పరిశీలకుడిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌గా హారికను, వైస్‌ఛైర్మన్లుగా కృష్ణంరాజు, శ్రీదేవిని సభ్యులు ఎన్నుకున్నారు. హారికను కైకలూరు జడ్పీటీసీ సభ్యురాలు కూరెళ్ల బేబీ ప్రతిపాదించగా, కోడూరు జడ్పీటీసీ సభ్యుడు యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ బలపర్చారు. వైస్‌ఛైర్మన్‌గా కృష్ణంరాజును తోట్లవల్లూరు జడ్పీటీసీ సభ్యుడు రామమోహనరెడ్డి ప్రతిపాదించారు. కృత్తివెన్ను జడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి బలపర్చారు. రెండో జడ్పీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా గరికపాటి శ్రీదేవి పేరును ఎ.కొండూరు జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా గనియా ప్రతిపాదించగా, మైలవరం జడ్పీటీసీ సభ్యుడు తిరుపతిరావు బలపర్చారు. ఒక్కొక్కరే పోటీపడడంతో, వారు ఎన్నికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్లన్మ ఎన్నిక పూర్తయినట్టు కలెక్టర్‌ ప్రకటించిన అనంతరం ప్రజాప్రతినిధులు, సభ్యుల హర్షధ్వానాల మధ్య వారిని వేదికపైకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

జిల్లా పరిషత్‌కు సంబంధించిన రెండు కో-ఆప్టెడ్‌ పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ల దాఖలు చేశారు. మొవ్వ మండలానికి చెందిన వేమూరి పరిశుద్ధరాజు, గన్నవరం మండలానికి చెందిన మహ్మద్‌ గౌస్‌లు ఎన్నికైనట్లు ప్రకటించారు. వారితో ప్రమాణ స్వీకారం చేయించి, ధ్రువపత్రాలు అందజేశారు. తొలుత ఛాట్రాయి జడ్పీటీసీ సభ్యురాలు అనూష, చివరలో మైలవరం జడ్పీటీసీ సభ్యుడు తిరుపతిరావు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా అని చదవాల్సి ఉండగా.. తడబడుతూ శాసనసభ ద్వారా అని ఎ.కొండూరు జడ్పీటీసీ సభ్యుడు భూక్యా గనియా చదివారు. దీంతో మళ్లీ ప్రమాణ పత్రం చదువుతూ ఆయనతో కలెక్టర్‌ ప్రమాణం చేయించారు. మోపిదేవి జడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జునరావు ఒక్కరు మాత్రమే తెదేపా అభ్యర్ధిగా గెలుపొందారు. వైకాపా సభ్యులు ఆ పార్టీ కండువాలు వేసుకుని వచ్చారు. ఒకే ఒక్క వ్యక్తి పసుపు కండువాతో సమావేశానికి హాజరయ్యారు.

కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు

హాజరైన ప్రజాప్రతినిధులు

కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హాజరయ్యారు. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, శాసనసభ్యులు కొలుసు పార్ధసారథి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్‌, సింహాద్రి రమేష్‌బాబు, కైలే అనిల్‌కుమార్‌, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్‌, మేకా వెంకటప్రతాప్‌ అప్పారావు, ఎమ్మెల్సీ కరీమున్నీసా, ఆర్టీసీ రీజినల్‌ ఛైర్‌పర్సన్‌ తాతినేని పద్మావతి, తదితరులు హాజరయ్యారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తమ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.


అందరి సహకారంతో అభివృద్ధి

డ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాన్ని నాకు కట్టబెట్టిన ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పార్టీ పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు సంపూర్ణంగా కృషి చేస్తా. నాకంటే ముందు చాలా మంది పెద్దలు ఈ పీఠాన్ని అధిరోహించారు. వారికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి బాటలో నడిపిస్తా. జిల్లా వ్యాపారం, సినిమా, కళలు, విద్య, వైద్యం, పర్యటకం, వ్యవసాయం, పరిశ్రమ, తదితర రంగాల్లో పురోగతి సాధించింది. జిల్లా పేరు ఇనుమడింపజేసేలా నా వంతుగా తోడ్పాటు అందిస్తా. 

- హారిక


ప్రమాణ స్వీకారం చేసిన నిండు గర్భిణి

జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నిండు గర్భిణి అయిన నందివాడ జడ్పీటీసీ సభ్యురాలు దుర్గాకుమారి వచ్చారు. కార్యక్రమం అయిపోయే వరకూ ఉండలేనంటూ.. కలెక్టర్‌ నివాస్‌కు విన్నవించుకున్నారు. దీంతో కార్యక్రమానికి ముందే.. కలెక్టర్‌ తన ఛాంబర్లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని తన వాహనంలో దుర్గాకుమారిని ఇంటికి పంపించారు.


ప్రధాన గేటు వద్ద తోపులాటలు

తోపులాటలో ముందుకుపడిపోతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక

ప్రమాణ స్వీకారం సందర్భంగా జడ్పీ ప్రాంగణంలోకి అధికారులు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు, మీడియాను మినహా ఎవరినీ అనుమతించకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉప్పాల హారిక గుడ్లవల్లేరు మండల పరిధిలోని వేమవరం గ్రామంలో వేంచేసియున్న కొండాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజులు నిర్వహించి పలువురు సభ్యులతో కలిసి జిల్లా పరిషత్‌కు ర్యాలీగా వచ్చారు. వారితో పాటు అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ వెంట వచ్చారు. ప్రదర్శన మచిలీపట్నంలోని జడ్పీ కూడలి వద్దకు రాగానే పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. హారికతో పాటు జడ్పీలోకి ఆమె అభిమానులు, పార్టీ నాయకులు ప్రధాన గేటు నెట్టుకుని చొచ్చుకువచ్చే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హారిక పడబోయారు. ఈ తోపులాటలో పోలీసులు, కార్యకర్తలు కింద పడ్డారు. వైకాపా కార్యకర్తలను పోలీసులు అదుపు చేయడం కష్టసాధ్యంగా మారింది. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కూడా తోపులాటలు ఆగలేదు. ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ జడ్పీలోకి వచ్చారు. ఆయనతో పాటు లోపలికి వచ్చే వారిని బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ అడ్డగించారు. దీంతో వైకాపా నేతలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి గమనించిన బందరు డీఎస్పీ బాషా జోక్యం చేసుకుని సీఐకు నచ్చజెప్పి వారిని లోపలికి అనుమతించారు. సభ్యులతో పాటు ఆయా మండలాల నుంచి వచ్చిన వారి అభిమానులు జడ్పీ గేటు బయటే వేచి ఉండి, కార్యక్రమం పూర్తయి వారు బయటకు వచ్చాక నినాదాలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని