శభాష్‌.. మహేష్‌
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

శభాష్‌.. మహేష్‌

తండ్రి కలను సాకారం చేసేందుకు ఆ తనయుడు అహర్నిశలు శ్రమించాడు.. ఆదిలో సానుకూల ఫలితాలు రాకపోయినా నిరాశ చెందకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. నాన్నకు ఇష్టమైన సివిల్‌ సర్వీసెస్‌ని ఎంచుకున్నారు. ఏడో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకొని ఐపీఎస్‌లో స్థానం దక్కించుకున్నారు. అయినప్పటికీ ఏదో తెలియని అసంతృప్తి తనను మళ్లీ సివిల్స్‌ రాసేలా చేసింది. దీంతో తాజాగా వెలువడిన సివిల్‌ సర్వీసెస్‌-2021 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి స్థానం దక్కించుకున్న 40 మందిలో తన పేరును కూడా మెరిపించారు. పామర్రు మండలం రిమ్మనపూడి శివారు జేపీగూడెంకి చెందిన జువ్వనపూడి మహేష్‌ 717వ ర్యాంకు సాధించారు. అంజయ్య, జేవీవీ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. అంజయ్య రైల్వేలో సీనియర్‌ ఎలక్ట్రికల్‌ డివిజినల్‌ ఇంజినీర్‌గా ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. మహేష్‌ చిన్ననాటి నుంచి చదువులో ప్రథమ శ్రేణుల్లో రాణించారు. ఉన్నత పాఠశాల, ఇంటర్‌ విజయవాడలో పూర్తిచేశారు. పదో తరగతిలో 82 శాతం, ఇంటర్‌ (2006-2008)లో 93 శాతం మార్కులొచ్చాయి. అనంతరం ఖరగ్‌పూర్‌ ఐఐటీలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తిచేసి ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం వదులుకొని 2013లో దిల్లీలోని శిక్షణ కేంద్రంలో చేరి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. అదే సంవత్సరంలో తొలిసారి ప్రిలిమ్స్‌ రాయగా మెయిన్స్‌కు ఎంపిక కాలేదు. తరువాత రెండు సార్లు మెయిన్స్‌ వరకు వెళ్లారు. 2019 అక్టోబరులో ప్రధాన పరీక్షలకు హాజరయ్యారు. తదుపరి 2020లో వెల్లడైన ఫలితాల్లో 612వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కి ఎంపికయ్యారు. హైదరాబాదులోని ఐపీఎస్‌ శిక్షణలో ఉంటూనే గత ఏడాది మరోసారి సివిల్స్‌ రాశారు. ఇంతవరకూ ఎనిమిది సార్లు సివిల్స్‌ పరీక్షలు రాయగా నాలుగు సార్లు ప్రధాన పరీక్షల వరకు వెళ్లగలిగానని.. అదే లక్ష్యంతో సిద్ధమవగా కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్తున్నారు మహేష్‌.

- న్యూస్‌టుడే, పామర్రు గ్రామీణం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని