అవి ఇవి అన్ని
eenadu telugu news
Updated : 26/09/2021 03:54 IST

అవి ఇవి అన్ని

నేటి అర్ధరాత్రి నుంచి బస్సుల బంద్‌

విజయవాడ బస్టేషన్‌, న్యూస్‌టుడే: ప్రజా సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు మద్దతుగా సోమవారం ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలివేయనున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం 1 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని 1234 బస్సులు ఆగిపోనున్నాయి. సోమవారం మధ్యాహ్నం తర్వాత యధావిధిగా సర్వీసులను పునరుద్ధరించనున్నారు.


నేడూ విద్యుత్తు బిల్లుల చెల్లింపులు

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : సెలవు దినమైనప్పటికీ ఆఖరి ఆదివారం కావటంతో జిల్లాలోని విద్యుత్తు వినియోగదారులు బిల్లులు చెల్లించవచ్చని ఎస్‌ఈ ఎం.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని చెప్పారు. అలాగే ఏపీసీపీడీసీఎల్‌ కస్టమర్‌ యాప్‌, పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌ పే, భీమ్‌, బిల్‌డెస్క్‌ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని ఆయన వివరించారు.


ప్రదక్షిణలకు అనువుగా బౌద్ధ మహా స్తూపం

ఘంటసాల, న్యూస్‌టుడే: ఘంటసాలలో కొన్ని వారాలుగా బౌద్ధ మహా స్తూపం చుట్టూ వర్షం నీరు నిల్వ ఉండడంతో బౌద్ధ భిక్షువులు, పర్యాటకులు ప్రదక్షిణలు చేసేందుకు ఆటంకం ఏర్పడింది. ఈ సమస్యపై ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఈ నెల 23న ‘బౌద్ధ సంపద పై నిర్లక్షపు నీడ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై పురావస్తు శాఖ అధికారులు, 5 జిల్లాల ప్రాంతీయ అగ్నిమాపక అధికారి(ఆర్‌ఎఫ్‌ఓ) శ్రీనివాసులు ఆదేశాలతో మొవ్వ అగ్నిమాపక అధికారి రాంబాబు, సిబ్బంది రెండు రోజులపాటు రాత్రింబవళ్లు శ్రమించి శుక్రవారం రాత్రి కల్లా స్తూపం చుట్టూ నిలిచిపోయిన వాన నీటి తొలగింపు పూర్తి చేశారు. బౌద్ధ భిక్షువు ధమ్మ ధజ బంతే థేరో, పలువురు బౌద్ధులు, పర్యాటకులు ‘ఈనాడు’కు ధన్యవాదాలు తెలిపారు.


30న ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజరు(జీఎం) గజానన్‌మల్యా ఈ నెల 30వ తేదీన సమావేశం నిర్వహించనున్నారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం ఈటీసీీసీీలో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎంతోపాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొననున్నారు. ఏటా ఎంపీీలతో జీఎం సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమావేశంలో రైల్వేపరంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలపై ఎంపీీలు జీఎంకు వినతి పత్రాలు అందజేస్తారు. సమావేశ వివరాలను జీఎం రైల్వే బోర్డుకు నివేదిస్తారు. ఏపీీలోని అన్ని పార్టీల ఎంపీీలు పాల్గొననున్నారు.


బీసీ సమాఖ్య రాష్ట్ర యువజన అధ్యక్షునిగా శ్రీనివాసరావు

చుట్టుగుంట, న్యూస్‌టుడే: రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య యువజన విభాగం అధ్యక్షునిగా న్యాయవాది వేముల శ్రీనివాసరావు నియమితులయ్యాడు. చుట్టుగుంటలోని రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి నుంచి శ్రీనివాసరావు నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో బీసీల జనగణన చేపడతామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక, ఇప్పటి వరకూ దానిని అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మి, నగర మహిళా అధ్యక్షురాలు దామర్ల సాంబ్రాజ్యం, శీలం లెనిన్‌, యువకులు వి.రామకృష్ణ, డి.గురుబ్రహ్మం, యు.భాను, తదితరులు పాల్గొన్నారు.


అఖిల భారత శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం ఆవిర్భావం

సత్యనారాయణపురం(విజయవాడ), న్యూస్‌టుడే : దేశంలో శ్రీవైష్ణవ కుటుంబాల సంక్షేమం, సంప్రదాయ విలువలు కాపాడటంతోపాటు వారి సమస్యలు పరిష్కరించేందుకు శ్రీవైష్ణవ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన కె.వి.నరసింహాచార్యులు తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురంలోని గాయత్రి కల్యాణ మండపం ఆవరణలో శనివారం శ్రీవైష్ణవ సంక్షేమ సంఘ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, సంఘాన్ని పటిష్టం చేసేందకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు. నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా నండూరి పవన్‌కుమార్‌ ఆచార్యులు, ప్రధాన కార్యదర్శిగా ముడుంబై రఘువర కృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శిగా ఎస్‌.శ్రీనివాసాచార్యులు, కోశాధికారిగా ఎ.రామకృష్ణమాచార్యులు, ప్రచార కార్యదర్శిగా ఎన్‌.రాఘవాచార్యులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించే శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు తమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతోందని నాయకులు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని