బంగారు గొలుసు దొంగల అరెస్టు
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

బంగారు గొలుసు దొంగల అరెస్టు

నందిగామ, న్యూస్‌టుడే: కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మహిళల మెడల్లో బంగారం గొలుసులు లాక్కెళ్లిన, ద్విచక్రవాహనాలు చోరీ చేసిన అంతర్‌ జిల్లాల దొంగలను నందిగామ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.7.52 లక్షల విలువ చేసే 155 గ్రాముల బంగారం, రూ.70 వేల నగదు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ నందిగామ పోలీసు స్టేషన్‌లో శనివారం కేసు వివరాలు వెల్లడించారు. నందిగామ కాకాని నగర్‌లో ఆగస్టు 17న ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై వచ్చి భోజనం హోటల్‌ ఎక్కడ ఉందని ఇంటి ఆవరణలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు గద్దే కోటేశ్వరమ్మను అడిగారు. సమాధానం చెబుతుండగా ఆమె మెడలోని 30 గ్రాముల బంగారం గొలుసు లాక్కెళ్లారు. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడ వాంబే కాలనీకి చెందిన చింతల దుర్గాప్రసాద్‌, కృష్ణలంక ద్వారకా నగర్‌కు చెందిన మోటూరి బాలశౌరిలను నిందితులుగా గుర్తించి సాంకేతికత ఆధారంగా విజయవాడలో వారిని అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, నగదు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో మూడు జిల్లాల పరిధిలోని రాబర్ట్‌సన్‌పేట, హనుమాన్‌జంక్షన్‌, పామర్రు, ఏలూరు, తెనాలి గ్రామీణ, ఉయ్యూరు, చిలకలూరిపేట, తాడేపల్లి, తెనాలి-1 పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో గొలుసులు, బైక్‌లు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కీలకమైన కేసును ఛేదించిన నందిగామ డీఎస్పీ, సీఐ, ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజు, కానిస్టేబుళ్లు కిశోర్‌, జాలయ్య, జ్యోతికుమార్‌లను అభినందించి రివార్డులు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని