ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరం
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం అవసరం

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలను రూపుమాపేలా ప్రభుత్వం తన విధానాలను, కార్యక్రమాలను, పథకాలను రూపకల్పన చేయాలని ఆచార్య కె.వై.రత్నం సూచించారు. ఆంధ్రా లయోల కళాశాలలో శనివారం నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్‌లో దళిత గిరిజనుల సాధికారత-సవాళ్లు-పరిష్కారాలు’ అంశంపై డీబీఆర్‌సీ రాష్ట్ర కార్యదర్శి అల్లడి దేవకుమార్‌ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆచార్య రత్నం మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారీ తనం, పారదర్శకత పెంచే విధంగా దళిత, గిరిజనులు పర్యవేక్షణ చేయాలన్నారు. వివిధ అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా అందరికీి సమాన అవకాశాలు, అసమానతలు, నిర్మూలన, వివక్షతలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో సమర్ధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ కుల సమాజాన్ని నిర్మూలించే పౌరసమాజాన్ని సృష్టించినప్పుడే దళిత గిరిజనుల సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఫాదర్‌ రాయప్ప, ఫాదర్‌ బాల, బొలిమెరి ఆనంద్‌ కుమార్‌, అలెర్ట్‌ జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. వేకువ గీతం పేరిట డీబీఆర్‌సీ రూపొందించిన కూర్పు కథల పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని