తుపాను ప్రభావంతో వర్షాలు
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

తుపాను ప్రభావంతో వర్షాలు

ఈనాడు-అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారడంతో శనివారం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. గులాబ్‌ ప్రభావంతో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. చెరుకుపల్లి, రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, తెనాలి, నూజండ్ల, వేమూరు, వినుకొండ, వట్టిచెరుకూరు, కొల్లిపర, చేబ్రోలు, బాపట్లతోపాటు గుంటూరు నగరంలో వర్షం కురిసింది. కొన్నిచోట్ల సాయంత్రం పిడుగులతోపాటు కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. డెల్టాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్తు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నూజండ్లలో కురిసిన వర్షానికి వచ్చిన నీటితో కమ్మవారిపాలెం ఆర్‌అండ్‌బీ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పల్నాడు ప్రాంతంలో తీతకు సిద్ధంగా ఉన్న పత్తికి వర్షం వల్ల నష్టం కలగనుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తి, మిర్చి పంటకు అనుకూలమని రైతులు చెబుతున్నారు. వాగులకు వరదలు రాకుండా సాధారణ వర్షమైతే అన్ని పంటలకు అనుకూలం. అయితే భారీవర్షాల పడి వరదలు వస్తే వాగుల వెంబడి ఉన్న పొలాలు కోతకు గురై ముంపు బారిన పడే ప్రమాదం ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని