జంట వ్యాధులతో జాగ్రత్త సుమా!
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

జంట వ్యాధులతో జాగ్రత్త సుమా!

ఈనాడు-అమరావతి

జీజీహెచ్‌ వైద్యులు ఆర్‌.నాగేశ్వరరావు

జిల్లాలో డెంగీ, మలేరియా, టైపాయిడ్‌ జ్వరాలతో పాటు కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. డెంగీ-కరోనా, టైఫాయిడ్‌-కరోనా, మలేరియా-కరోనా ఇలా ఒకే వ్యక్తిలో రెండు రకాల వ్యాధులు బయటపడుతున్నాయి. ఎవరికైతే రెండు వ్యాధులు ఉన్నాయో వారు వైద్యుల పర్యవేక్షణలోనే సేవలు పొందటం మేలని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల సామాజిక-వ్యాధుల విభాగం(ఎస్‌పీీఎం) విభాగాధిపతి ఆచార్య ఆర్‌.నాగేశ్వరరావు హెచ్చరించారు. మరికొందరు శరీరంపై మచ్చలు వచ్చాయని ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇవన్నీ సీజనల్‌ వ్యాధులే. చిన్న దోమ కాటే కదా అని నిర్లక్ష్యం వహిస్తే అది భారీ ఆర్థిక నష్టాన్ని కలుగజేయటమే కాదు.. ప్రాణాన్ని హరిస్తుందన్నారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు విషయాలు చెప్పారు.

* రాత్రిపూట దోమ తెరలు వాడకంతో పాటు పగటిపూట టైగర్‌ దోమ కుట్టకుండా రక్షణ చర్యలకు ఉపక్రమించాలి. శరీరానికి వేప నూనె రాసుకోవాలి. ఇది శరీరంపై ఐదు గంటల పాటు ఉంటుంది. దీని వాసనకు అసలు దోమ అనేది శరీరంపై వాలదు. ఈ మధ్య మార్కెట్లోకి ఆయిల్‌బాల్స్‌తో కూడిన దోమతెరలు, ఇంటిగ్రేటెడు మస్కిటో నెట్లు వచ్చాయి. వీటి వాడకం ద్వారా దోమలు నుంచి ఉపశమనం పొందొచ్ఛు మలేరియాకు కారణమయ్యే దోమ రాత్రి పూట కుడుతుంది. డెంగీని నిర్లక్ష్యం చేస్తే మెదడు, కిడ్నీలు పాడైపోతాయి. దీనికి కారణమయ్యే దోమ కాటు నుంచి దూరం కావటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

* రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారిలోనే ఒకేసారి రెండు రకాల వ్యాధులు బయటపడటం చూస్తున్నాం. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి.

* కొందరికి ఉన్న పళంగా జ్వరం వస్తుంది. ఆపై నీరసం, నిస్సత్తువ అనిపిస్తుంది. విపరీతమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. గొంతు నొప్పి, జలుబు చేస్తుంది. ఇవి కొవిడ్‌-డెంగీకి సంకేతాలు. ఈ లక్షణాలు కలిగినవారు వెంటనే అప్రమత్తమై బీపీ ఏమైనా తగ్గిందా? ప్లేట్‌లెట్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటానికి సీబీపీ పరీక్షలు చేయించుకోవాలి. కరోనా-డెంగీ నిర్ధారణ అయిన వారు అవి రెండూ తగ్గుముఖం పట్టేదాకా రక్తం గడ్డలు కట్టకుండా చూసుకోవటానికి తరచూ డీ డైమర్‌, సీబీపీ పరీక్షల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి.

* టైఫస్‌ జ్వరాలు పేను కుట్టడం ద్వారా వస్తాయి. ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళల్లో కనిపిస్తున్నాయి. గుంటూరు నగరంలో పలు ఆసుపత్రుల్లో బాధితులు ఉన్నారు. టైఫాయిడ్‌ జ్వరాలు బాగానే వస్తున్నాయి. కలుషిత ఆహారం, కలుషిత నీళ్లతో ఇది వ్యాప్తి చెందుతోంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని