వైద్య రంగంలో ఫార్మసిస్టులదే కీలకపాత్ర
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

వైద్య రంగంలో ఫార్మసిస్టులదే కీలకపాత్ర

తాడికొండ: విద్యార్థికి బహుమతి ఇస్తున్న ‘ఒపెక్స్‌’ సీఈవో సచిన్‌ కాంబోజ్‌

తాడికొండ, న్యూస్‌టుడే: ప్రపంచంలోనే నేడు వైద్య రంగంలో ఫార్మసిస్టులే కీలక పాత్ర పోషిస్తున్నారని ఒపెక్స్‌ ఎక్సెలెరేటర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ సీఈవో సచిన్‌ కాంబోజ్‌ అన్నారు. శనివారం ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా లాం చలపతి ఫార్మసి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వైద్య సంరక్షణలో భాగంగా వేర్వేరు నేపథ్యాల ఔషధ వర్గాల మధ్య సమన్వయం పెంచడానికి ఈ వేడుకలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు పరిశోధన వైపు వెళ్లడానికి కళాశాలల్లోని ప్రయోగ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ నాదెండ్ల రామారావు మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకుంటే ఉపయుక్తమైనవి ఆచరణలో పెట్టడానికి ఒపెక్స్‌ సంస్థ నుంచి ఆర్థిక సాయం అందుతుందన్నారు. దీంతో పలువురు విద్యార్థులు తమ ఆలోచలను నిపుణుల ముందు పెట్టారు. అనంతరం అమరావతి రీజనల్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు జస్ట్‌ ఎ మినిట్‌, లిఫ్‌లెట్‌, కాప్షన్‌ రైటింగ్‌ తదితర అంశాల్లో పోటీలు జరిపి విజేతలకు బహుమతులు అందజేశారు.

గుంటూరు గ్రామీణం: వెబినార్‌కు హాజరైన ఫార్మారంగ ప్రముఖులు

చౌడవరం (గ్రామీణ గుంటూరు), న్యూస్‌టుడే: నగర శివారులోని చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాల (చిప్స్‌)లో ప్రపంచ ఫార్మసీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అసోసియేషన్‌ ఎడ్యుకేషన్‌ డివిజన్‌, నైరుతి ఆసియా ప్రాంతీయ ఫార్మా ఫోరం ఆధ్వర్యంలో శ్రీలంక, ఇండోనేషియా దేశాలకు చెందిన పలు ఫార్మా సంఘాలు, చిప్స్‌ కళాశాల కలిసి అంతర్జాతీయ స్థాయిలో వెబినార్‌ నిర్వహించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నైరుతి ఆసియా ప్రాంతీయ కార్యాలయ సలహాదారుడు డాక్టర్‌ మనీషాశ్రీధర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఫార్మసీ రంగంలోని కొత్త ఆవిష్కరణలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించారు. కమ్యూనిటీ ఫార్మసీ డివిజన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ మంజరీఝారత్‌, ఫార్మసీ రంగ నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. చిప్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సూర్యదేవర విద్యాధర ప్రస్తుతం ఫార్మసీ రంగంలో ఉన్న అవకాశాలపై మాట్లాడారు.అనంతరం విద్యార్థులకు పలు పోటీలు జరిపి, విజేతలకు వెబినార్‌లో ఈ ధ్రువపత్రాలు పంపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని