రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
eenadu telugu news
Updated : 26/09/2021 12:12 IST

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం

కోడా సింహాచలం నందిపల్లి రాజు మృతదేహాలు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : నున్న గ్రామీణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని కండ్రిక-పాతపాడు రహదారిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... వాంబేకాలనీ ఏ బ్లాకు ప్రాంతంలో నివాసముంటున్న నందిపల్లి రాజు(19), నందిపల్లి రమణ(35), కోడా సింహాచలం(35)లు కుందావారి కండ్రిక వైపు నుంచి కండ్రిక వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నారు. మార్గమధ్యంలో నిర్మాణ దశలో ఉన్న వంతెన వద్ద ప్రమాదానికి గురయ్యారు. మలుపు తిరగాల్సిన చోట తిరగకుండా నేరుగా వెళ్లి వంతెన కోసం వేసిన ఇనుప కడ్డీలను ఢీ కొట్టారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పరిశీలించారు. ఆ ప్రదేశం అంతా చీకటిగా ఉండటంతో సెల్‌ఫోన్‌ల వెలుతురులోనే తీవ్రంగా గాయపడిన రమణ, సింహాచలం లను గుర్తించారు. రాజు కొన ఊపిరితో ఉండగా, ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గమధ్యంలో చనిపోయాడు. రాజు, రమణలు సమీప బంధువులు అని తెలుస్తోంది. కోడా సింహాచలం, రమణలు హోటల్‌లో వంట మేస్త్రీలుగా పనిచేస్తున్నారని సమాచారం. రాజు వాహనం నడుపుతుండగా, మిగిలిన ఇద్దరూ వెనుక కూర్చుని ఉన్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే మల్లాది ఘటనాస్థలానికి వెళ్లి పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇన్‌ఛార్జి ఏసీపీ మోహన్‌కుమార్‌, సీఐ హనీష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి ముందు ఈ ముగ్గురు యువకులు కండ్రిక, కుందావారి కండ్రికలో వేగంగా ద్విచక్రవాహనం నడుపుతూ కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పోలీసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని