పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ

భవానీపురం(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు టూరిజం పాలసీని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలోని హరిత బరంపార్కు సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజత్‌ భార్గవ మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా పర్యాటక రంగానికి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ నష్టాల్లో లేకపోవడం సంతోషకరమన్నారు. విశాఖపట్నంలో బీచ్‌ కారిడార్‌తోపాటు ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. లంబసింగి, అరకులోయ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టామన్నారు. రుషికొండలో ఐదు నక్షత్రాల హోటల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం టూరిజం యాప్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ టూరిజం పాలసీ అమలు చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టనున్నారని వెల్లడించారు. అంతకుముందు విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే విష్ణు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టూరిజం బోర్డు డైరెక్టర్లు నాగుళ్ల సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.మల్‌రెడ్డి, కార్పొరేటర్‌ ఆంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని