మోదీ పాలనపై సమరశంఖం
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

మోదీ పాలనపై సమరశంఖం

విజయవాడ(అలంకార్‌కూడలి, బస్‌ స్టేషన్‌), న్యూస్‌టుడే : కేంద్రంలోని మోదీ పాలనపై సమరశంఖం పూరించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రైతు, ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంభిస్తున్న మోదీ సర్కారుకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వామపక్ష, రాజకీయ పార్టీల నేతలంతా స్పష్టం చేశారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపుతో కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అధిక ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్‌ విజయవంతం అయింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ వద్ద వామపక్ష, కాంగ్రెస్‌, తెదేపా పార్టీలతో పాటు, ఏఐటీయూసీ, సీఐటీయూసీ, ఇఫ్టూ, టీఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బస్‌ స్టేషన్‌ నుంచి జాతీయ రహదారిపై జోరు వానలోనూ ప్రదర్శన నిర్వహించారు. ఫ్లకార్డులు పట్టుకుని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నినదించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అంబానీ, ఆదానీకి కారుచౌకగా కట్టబెడుతున్నారని, ఇప్పటికైనా మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని హితవు పలికారు. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను విపరీతంగా పెంచేసిందన్నారు. ఆంగ్లేయుల పరిపాలనను తలపించేలా మోదీ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను వరుసగా విక్రయించే కార్యక్రమానికి భాజపా సిద్ధమైందన్నారు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్మే చర్యల్ని ఉపసంహరించుకోవాలని, ప్రైవేటీకరణ విధానాల్ని విడనాడకుంటే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి కె.పోలారి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు  వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


‘కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి మార్కెట్‌ యార్డులు’

గొల్లపూడి, న్యూస్‌టుడే: రైతులు పండించే పంటలు విక్రయించే మార్కెట్‌ యార్డులు కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లబోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కృష్ణా జిల్లా గొల్లపూడిలో నిర్వహించిన భారత్‌ బంద్‌లో ఆయన మాట్లాడుతూ రైతులకు కీడు చేసే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ చట్టాల వలన మార్కెట్‌ యార్డు వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. ప్రభుత్వాలు కళ్లు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను పెడుతున్నారని, శ్రీకాకుళం జిల్లాలో పెట్టడం ప్రారంభించారని తెలిపారు. రైతులు డబ్బులు కట్టిన తర్వాతనే విద్యుత్తు ఇచ్చే పరిస్థితి వస్తుందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారని, అందుకు మద్దతు తెలిపిన వైకాపా స్థానికంగా డ్రామాలు ఆడుతోందన్నారు. వ్యవసాయ బిల్లులకు ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు తెలిపి ఇప్పుడు ప్రతిపక్షాలను తిడుతున్నారన్నారు. 28 మంది ఎంపీలను పెట్టుకుని దిల్లీలో ఒక మాట, మన రాష్ట్రంలో మరోలా మాట్లాడుతున్నారని ఉమా విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని