వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

ఉంగుటూరు (గన్నవరం గ్రామీణం), కృష్ణలంక, న్యూస్‌టుడే: జిల్లాల్లో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఉంగుటూరు మండల పరిధిలోనే రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి.  ఆత్కూరు పోలీసుల కథనం ప్రకారం.. బాపులపాడు మండలం ఏ.సీతారామపురానికి చెందిన గాలంకి సాంబశివరావు(40).. ఉయ్యూరు మున్సిపాలిటీలో చిరుద్యోగిగా జీవనం సాగిస్తున్నారు. నిత్యం ఇంటి వద్ద నుంచే విధులకు వెళ్లి వస్తుంటారు. సోమవారం యథావిధిగా విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా తేలప్రోలు పంచాయతీ కార్యాలయం సమీపంలోకి చేరుకొనే సరికి వెనుక నుంచి వచ్చిన లారీ అతడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో సాంబశివరావు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు. ఇటీవలే పెద్ద కూతురికి వివాహం చేశారు.


పెద అవుటపల్లి వద్ద ...

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి చెందిన సంఘటన చెన్నై-కోల్‌కత జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి వద్ద సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు గాంధీనగర్‌ కాలనీకి చెందిన మదమంచి సాయికుమార్‌(24), మాగంటి మధుబాబు వరుసకు బావా బామర్దులు. ఇద్దరూ హనుమాన్‌జంక్షన్‌ సమీపంలోని పెద్దపాడు మండలం కుదరవల్లిలో చేపల చెరువు వద్ద కాపాలాదారులుగా జీవనం సాగిస్తున్నారు. చెరువుల వద్ద నడవడం ఇబ్బందిగా ఉందని కుటుంబ సభ్యులతో చెప్పి ఆదివారం రాత్రి కొల్లూరు నుంచి సైకిల్‌ పట్టుకుని ద్విచక్ర వాహనంపై కుదరవల్లి బయలుదేరారు. మార్గమధ్యలోని పెద్దఅవుటపల్లి చేరుకొనే సరికి మంగళగిరి మండలం నిడమర్రుకు చెందిన కొల్లి ప్రతాపరెడ్డి కారు.. వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మధుబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఆత్కూరు పోలీసులు క్షతగాత్రుడ్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు.


ఆర్టీసీ బస్సు ఢీకొని..  

కృష్ణలంక, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన కృష్ణలంక జాతీయ రహదారిపై జరిగింది. కొల్లిపర వెంకటేశ్వరావు(67) భార్య మాణిక్యమ్మతో కలిసి రాణిగారితోట బాపనయ్యనగర్‌లో నివాసముంటున్నారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆయన అల్లుడు కనిశెట్టి శ్రీనివాస్‌ లారీ డ్రైవర్‌. కోదాడలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిన వెంకటేశ్వరరావు తిరిగొచ్చే క్రమంలో అల్లుడు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్న లారీలో ఎక్కి ఆదివారం రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో కృష్ణలంక సమీపంలోని నేతాజీ వంతెన పరిసరాల్లో దిగారు. రోడ్డు దాటి ఇంటికెళుతుండగా పలాస నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు వెంకటేశ్వరరావును ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనాస్థలంలోనే మృతిచెందారు.  పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని