కుండపోత..
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

కుండపోత..

కాలనీలను ముంచెత్తిన వరద
విజయవాడ జలమయం
ఈనాడు, అమరావతి

గులాబ్‌ తుపాను ప్రభావం జిల్లాపై పడింది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బంద్‌ కూడా కావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. పలు ప్రాంతాల్లో వాగులు పొంగాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. జి.కొండూరు మండలంలో రహదారి కోతకు గురైంది. కొంత పంట నష్టం వాటిల్లింది. ఇదే పరిస్థితి ఉంటే పత్తి, మిరప ఇతర పంటలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా చివరి ఆయకట్టుకు గులాబ్‌ తుపాను మేలు చేసింది. బ్యారేజీ నిండా నీరు ఉన్నా కాలువలు సక్రమంగా లేక పలు మండలాల్లో వరి పంట ఎండుతోంది. వీటికి ఈ వానలు ప్రయోజనం కలిగించినట్లయింది. జిల్లాలో సగటు వర్షపాతం 44.4 మి.మీగా నమోదైంది. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. జి.కొండూరు మండలంలో అత్యధికంగా 178 మి.మీల వర్షం కురిసింది. మోపిదేవి మండలంలో స్వల్పంగా 8 ఎంఎం నమోదైంది. బాపులపాడు, వీరులపాడు, గంపలగూడెం, రెడ్డిగూడెం, తదితర మండలాల్లో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరువూరులో కట్టలేరు, ఎదుళ్లవాగు, విప్లవాగు, కొండవాగు ఇతర వంకలు పొంగాయి. తిరువూరు గంపలగూడెం, జికొత్తూరు, అక్కపాలెం, కాకర్ల-నల్లపట్ల, పల్లెర్లమూడి కొత్తూరు మధ్య వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. వైరా నది పొంగడంతో దాములూరు వీరులపాడు మధ్య రాకపోకలు నిలిచాయి. మున్నేరు పొంగింది. ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. సుమారు 80వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. 40గేట్లు రెండు అడుగులు, 30 గేట్లు ఒక అడుగు చొప్పున ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు.

నగరవాసుల అవస్థలు..: విజయవాడ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైన వాన ఎడతెరిపి లేకుండా కురిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోతలా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. విజయవాడ అర్బన్‌, గ్రామీణ మండలం పరిధిలో 35.4 మిమి వర్షం కురిసింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు పలుచోట్ల జలమయంగా మారింది. చిట్టినగర్‌లో కొండచరియలు విరిగిపడి రెండు ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఆటోనగర్‌, మాచవరం, ఈఎస్‌ఐ ఆస్పత్రి రోడ్డులో నివాసాల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వన్‌టౌన్‌, కృష్ణలంక, సూర్యారావుపేట, గవర్నర్‌పేట, మధురానగర్‌ తదితర ప్రాంతాలలో నీరు చేరింది. మొగల్రాజపురంలో పలు కాలనీల్లోకి నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని