బంద్‌ విజయవంతం
eenadu telugu news
Published : 28/09/2021 03:20 IST

బంద్‌ విజయవంతం

మూతపడిన దుకాణాలు, విద్యా సంస్థలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు
ఈనాడు, అమరావతి

విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు

భారీ వర్షంలోనూ అఖిలపక్ష నాయకులు ఉత్సాహంగా పాల్గొని భారత్‌ బంద్‌ను విజయవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి జిల్లాలో జరిగిన బంద్‌కు స్పందన కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ కమిటీ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు సోమవారం భారత్‌ బంద్‌ జరిగింది. దీనికి అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. వివిధ రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతుగా నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని డిమాండ్‌ చేశారు. బంద్‌కు ప్రభుత్వం మద్దతు తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే బస్సు సర్వీసులు నిలిచాయి. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రోడ్డెక్కాయి.బస్సులు తిరగకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు, ఉద్యోగులు, వ్యాపారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల ర్యాలీ

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండు వద్ద జరిగిన నిరసనల్లో తెదేపా, వామపక్షాలు, కాంగ్రెస్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఇఫ్టూ, టీఎన్‌టీయూసీ, తదితర పార్టీలు, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, సీపీఐ ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి పోలారి, వామపక్ష నేతలు శ్రీనివాసరావు, బాబూరావు, దోనెపూడి శంకర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీనాశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భాజపా ప్రభుత్వ నిరంకుశ విధానాలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు.
భారత్‌ బంద్‌ సందర్భంగా ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. దీంతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. వాణిజ్య, వర్తక, ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార రంగ సంస్థలు, బ్యాంకులు మూతబడ్డాయి. గొల్లపూడిలోని తెదేపా కార్యాలయం ముందు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతులతో కలిసి నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి నాదెళ్ల కృష్ణ, కృష్ణాజిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి వీరవెంకట్య ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌కు మద్దతుగా బెంజిసర్కిల్‌లోని కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో తెదేపా ఆధ్వర్యంలో తెలుగు రైతు రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు గద్దె వెంకటేశ్వర ప్రసాద్‌ నేతృత్వంలో నిరసన తెలిపారు. సీపీఐ, సీపీఎం నేతలు దుర్గారావు, నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ గేటు వరకు ప్రదర్శన నిర్వహించారు.

మైలవరంలో జరిగిన బంద్‌కు సంఘీభావంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. తెదేపా, కాంగ్రెస్‌, వామపక్షాలు నిరసనల్లో పాల్గొన్నాయి. గుడివాడ, నందిగామలో జోరువానలోనూ అఖిలపక్ష నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని