దసరా ప్రయాణం వెలవెల
eenadu telugu news
Published : 15/10/2021 03:19 IST

దసరా ప్రయాణం వెలవెల

ఈనాడు - అమరావతి

వరుసగా రెండో ఏడాది కూడా కరోనా ప్రభావంతో దసరా ప్రయాణం వెలవెలబోయింది. కొవిడ్‌ ఉద్ధృతి కాస్త తగ్గినా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గత స్థాయికి రాలేదు. దసరా వచ్చిందంటే చాలు.. సీట్లకు యమగిరాకీ ఉండేది. కరోనా కారణంగా ఈ పరిస్థితి కనిపించలేదు. ప్రత్యేక సర్వీసుల సంగతి అటుంచితే సాధారణ బస్సుల్లోనూ పెద్దగా రద్దీ కనిపించడం లేదు. ఈసారి వివిధ కారణాలతో ప్రయాణాలు తగ్గాయి. ఇసుక వేస్తే రాలనంతగా జనాలతో కిక్కిరిసే పీఎన్‌బీఎస్‌ ఓ మోస్తరు రద్దీ నెలకొంది. ఫలితంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు పూర్తి స్థాయిలో నడపలేని పరిస్థితులు నెలకొన్నాయి.

* దసరా ఉత్సవాలకు ఉత్తరాంధ్ర, తమిళనాడు, హైదరాబాద్‌ నుంచి ఎక్కువగా భక్తులు వస్తుంటారు. ఈ విద్యా సంవత్సరంలోనూ పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తెరుచుకోలేదు. కొన్ని ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నాయి. కరోనా భయంతో సెలవులకు బంధువులు, ఇతర చోట్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది. పండుగ ప్రయాణాలు చేసేవారిలో చాలా మంది బస్సుల వైపు మొగ్గు చూపడం లేదు. గతంలో దసరా సందర్భంగా ముందస్తు రిజర్వేషన్ల కోసం ఎగబడిన వారు ఈ దఫా సొంత వాహనాలను ఉపయోగిస్తున్నారు. లేని వారు అద్దెకు కార్లు మాట్లాడుకుని ప్రయాణాలు చేస్తున్నారు. జిల్లా నుంచి వెళ్లి హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే వారిలో ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వీరింతా ప్రస్తుతం స్వస్థలాల్లోనే ఉన్నారు.

*దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. మొత్తం 727 బస్సులు నడపాలని ప్రణాళిక రచించుకున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం మార్గాల్లో ఇవి తిరుగుతున్నాయి. ఈ రూట్లో రోజువారీ 168 సర్వీసులు నడుస్తున్నాయి. రెగ్యులర్‌ సర్వీసుల్లో ఓఆర్‌ 70 శాతం ఉంటోంది. తిరుగుతున్న ప్రత్యేక బస్సుల్లో 80 శాతం వరకు నమోదు అవుతోంది. డిమాండ్‌ పెద్దగా లేకపోవడంతో స్పెషల్స్‌లో కొన్ని మాత్రమే నడుస్తున్నాయి. 10వ తేదీన 38, 11న.. 13, 12న.. 22, 13న.. 37 మాత్రమే తిరిగాయి. గురువారం నాడు కూడా పెద్దగా రద్దీ కనిపించలేదు. హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చేందుకు గురువారం నాడు రెగ్యులర్‌ బస్సులకు తోడు 15 స్పెషల్‌ సర్వీసులు వెశారు. తిరుగున్న వాటిల్లో రాజమహేంద్రవరం, విశాఖపట్నం నగరాలకే డిమాండ్‌ ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని