పల్నాడు నుంచే పోరుబాట
eenadu telugu news
Updated : 15/10/2021 06:17 IST

పల్నాడు నుంచే పోరుబాట

గుత్తికొండ సభ ద్వారా జనారణ్యంలోకి..

ఈనాడు-గుంటూరు, న్యూస్‌టుడే, దుగ్గిరాల


ఆర్కే నడియాడిన నేల తుమృకోట గ్రామం

అప్పట్లో పల్నాడులోని పల్లెల్లో సారా తయారీ, విక్రయాలు పెద్దఎత్తున జరిగేవి. సారా తయారీ, రవాణాకు ప్రత్యేకంగా గుత్తేదారులు ఉండేవారు. గుత్తేదారులందరినీ ఆర్కే గ్రామాల నుంచి వెళ్లగొట్టారు. అప్పటి ఫ్యాక్షన్‌ పరిస్థితులను మార్చాలంటే పీపుల్స్‌వార్‌ ఉద్యమమే మార్గమని విశ్వసించి వారి భావాలకు ఆకర్షితులై ఉద్యమబాట పట్టారు. మావోయిస్టు ఉద్యమంలో కీలకస్థాయికి ఎదిగారు. ఆర్కే పోలీసు కాల్పుల్లో చనిపోయారని తెలుసుకున్న వారు ఎలా జరిగింది? ఎక్కడ జరిగిందని? ఆరా తీశారు.

రాడికల్‌ విద్యార్థిగా ప్రస్థానం.. ఆర్కే స్వస్థలం జిల్లాలోని పిడుగురాళ్ల మండలం గుత్తికొండ ఇప్పటికీ అతని బంధువులు పల్నాడులోని పలు ప్రాంతాల్లో ఉన్నారు. ఆర్కే తండ్రి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కావడంతో రెంటచింతల మండలం తుమృకోటలో స్థిరపడ్డారు. అక్కడే పాఠశాల విద్య పూర్తిచేసిన ఆర్కే కళాశాల విద్యను మాచర్లలో పూర్తిచేశారు. ఆసమయంలోనే రాడికల్‌ విద్యార్థి నేతగా ఉంటూ పీపుల్స్‌వార్‌ ఉద్యమానికి ఆకర్షితులై వారితో కలిసిపోయారు. అక్కిరాజు హరగోపాల్‌(ఆర్కే) చదువుకునే సమయంలో అందరితో పరిచయాలు ఏర్పరచుకుని విద్యార్థి నేతగా ఎదిగారు. ఉద్యమంలో చేరిన తొలిరోజుల్లో ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్లారని నాటి నుంచి 2004లో ప్రభుత్వంతో చర్చల సమయంలో జనారణ్యంలోకి వచ్చినప్పుడే ఆర్కేను స్థానికులు చూశారు. అప్పటివరకు పత్రికలు, టీవీల్లో వచ్చే ఊహచిత్రం చూడటమేనని స్థానికులు చెబుతున్నారు. జనారణ్యంలోకి వచ్చే సమయంలో గుత్తికొండ బిలం వద్ద సభ నిర్వహించారు. ఆర్కే ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత ఉద్యమంలో ఉన్న పద్మక్కను ప్రేమ వివాహం చేసుకున్నారు.

నకిరేకల్‌లో ఆర్కేను కలిశాం

మావోయిస్టు అగ్రనేత ఆర్కే తండ్రి అక్కిరాజు సశ్చిదానందరావు తమతోపాటు తుమృకోట ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా చేశారు. 6 వతరగతి నుంచి 10 వతరగతి వరకు తుమృకోటలో తాను పని చేస్తున్నప్పుడే రామకృష్ణ చదివారు. 1976లో అక్కడి నుంచి బదిలీపై వచ్చాక రామకృష్ణ గురించి తెలియలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో మావోయిస్టులు చర్చలకు వెళ్లేటప్పుడు నకిరేకల్‌లో ఆర్కేను కలిశాం. ఆ రోజు తోటి ఉపాధ్యాయుడు మరొకరితో కలిసి నకిరేకల్‌ వెళ్లి కలిశాం. ఆర్కే బృందం వెంట దాదాపు 50 పోలీసు వాహనాలు ఉన్నాయి. మాశిష్యుడే కదా చిన్నప్పుడు చూశాం ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్లాం. ఆర్కే చుట్టూ కర్రలతో మగ, ఆడపిల్లలు రక్షణ ఉంటూ దగ్గరికి వెళ్లనీయలేదు. కొద్దిసేపటికి మాస్టార్లు వచ్చారని ఆర్కేకి ఎవరో చెబితే బయటకు వచ్చిన ఆర్కే మాకు నమస్కారమండీ అన్న తర్వాత మమ్మల్ని అనుమతించారు.

- మాదు సీతారామయ్య, విశ్రాంత క్రాప్టు ఉపాధ్యాయులు, దుగ్గిరాల


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని