పోదుపుతోనే అదుపు
eenadu telugu news
Updated : 15/10/2021 05:11 IST

పోదుపుతోనే అదుపు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

ముంచుకొస్తున్న విద్యుత్తు కోతలు

వేసవి కాలంలోనే ఉండే విద్యుత్తు కోతలను వర్షాకాలంలో సైతం ఎదుర్కొనడానికి వినియోగదారులు సిద్ధంగా ఉండాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రకటన రాష్ట్రంలోని విద్యుత్తు పరిస్థితిని తెలియజేస్తుంది. అధికారికంగా గంటల్లోనే కోత ఉండవచ్చని అంటున్నారు. జిల్లాలో రోజుకు విద్యుత్తు వినియోగం సగటున 18 మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటుందని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. వినియోగాన్ని తగ్గించుకునేందుకు పొదుపు చర్యలు పాటించకపోతే అధిక ధరలు చెల్లించి దిగుమతి చేసుకునే విద్యుత్తు ఛార్జీలు వినియోగదారులకు మరింత భారం కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో దాదాపు 17 లక్షల వరకు గృహ, వాణిజ్య విద్యుత్తు సర్వీసులతో పాటు 9 వేల వరకు ఎల్‌టీ, హెచ్‌టీ సర్వీసులున్నాయి. వీటికి అదనంగా 67 వేల వరకు కుటీర, వ్యవసాయ ఇతర విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు డిస్కం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండు నెలలకు ముందు వరకు 24 గంటలు విద్యుత్తు సరఫరా ఉండేది. కొద్ది రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక సమయంలో అనధికార కోతలు అమలు చేస్తున్నారు. ఇక నుంచి సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పీక్‌ టైంలో అధిక విద్యుత్తు వినియోగ పరికరాల వాడకాన్ని తగ్గించుకోవాలని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ అధికార ప్రకన వెనుక రానున్న విద్యుత్తు సంక్షోభాన్ని చెప్పకనే చెపుతుంది. పరిశ్రమలను సాయంత్రం ఆరు గంటలకే మూసివేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుని అవసరమైతే ఉదయం ఆరు గంటల నుంచే పరిశ్రమలు పని చేసేలా పని గంటలు నిర్ణయించుకోవాలని అధికారులు జిల్లాలోని ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగదారులకు సూచిస్తున్నారు. విద్యుత్తు పొదుపుపై ప్రచార ఉద్యమాన్ని విద్యుత్తు శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు.

ఏసీల వాడకం తగ్గించాలి

ఇటీవల కాలంలో ఇళ్లలో ఏసీల వాడకం బాగా పెరిగింది. కొందరు కొంచెం ఎండగా ఉందంటూ మధ్యాహ్నం సమయంలోనే ఏసీలు వేసేస్తున్నారు. దోమలు ఉన్నాయనే కారణంతో రాత్రి 8 గంటలకే వేసేస్తున్నారు. తెల్లవార్లూ అలాగే ఉంచుతున్నారు.  ప్రస్తుతం అదనపు బిల్లులు భారం పెరిగినందున రోజుకు మూడు యూనిట్లు అదనంగా వాడినా నెలకు కరెంటు బిల్లు రూ.వేయి దాటేస్తుంది. కొవిడ్‌ నేపథ్యంలో ఏసీ వాడకం తగ్గించడమే మంచిది. పైగా కరెంటు బిల్లు, ట్రూఅప్‌ ఛార్జీల భారం తగ్గించుకోవచ్చు. అందరూ ఇలా పొదుపు చేస్తే.. రానున్న కాలంలో కోతలను తగ్గించడానికి దోహదపడుతుంది.

30 యూనిట్ల వరకు కలిసొచ్చింది

మా గృహా సముదాయాల్లో కామన్‌ లైట్ల వినియోగ గంటలను తగ్గించాం. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అన్ని ప్రాంతాలో లైట్లు వినియోగిస్తూ ఆ తర్వాత ఫ్లోరుకు ఒకటి రెండు మాత్రమే వాడుతున్నాం. అన్నీ ఎల్‌ఈడీ బల్బులనే వాడతుండడంతో నిర్వహణ ఛార్జీలు తగ్గాయి. ఇళ్లలో కూడా ఏసీలను తక్కువ సమయంలోనే వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నాం. కిటికీలకు దోమలు రాకుండా మెష్‌లు బిగించుకున్నాం. దీనివల్ల ఏసీ వినియోగం తగ్గించుకోవచ్చు. రెండు నెలలుగా వీటిని ఆచరణలో ఉంచడంతో విద్యుత్తు వినియోగం దాదాపు ఒక్కొక్క ఇంటికి 30 యూనిట్ల వరకు తగ్గింది. పది రోజులకోసారి విద్యుత్తు వినియోగం అంచనా వేసుకుంటూ కనీస వినియోగ ఛార్జీలు పెరగకుండా పొదుపు చర్యలు తీసుకుంటున్నాం.

- రాఘవరావు, అపార్ట్‌మెంట్‌ కార్యదర్శి, గుంటుపల్లి

ఇలా చేస్తే ఎంతో మేలు

* ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న ఎల్‌ఈడీ బల్బులను వాడితే ఎక్కువ కాంతి పొందడమే కాకుండా తక్కువ విద్యుత్తు వినియోగం అవుతుంది.

* 3 వాట్ల ఎల్‌ఈడీ బల్బు 45 వాట్ల ఫిలమెంటు బల్బుతో సమానం.

* వంటకు కరెంటు కుక్కర్‌కు బదులు గ్యాస్‌ వినియోగించే ప్రెజరు కుక్కరే వాడాలి. మార్కెట్‌లో లభిస్తున్న సౌరశక్తి కుక్కర్‌ ఉపయోగం అన్ని విధాలుగా ఉపయుక్తం.

* రిఫ్రజిరేటరును వాతావరణాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఢిప్రాస్ట్‌ చేస్తే కరెంటు ఆదాతో పాటు కంప్రెసర్‌ ఎక్కువ కాలం మన్నుతుంది.

* కొందరు అవసరం లేకపోయినా ఫ్యాన్లు, లైట్లు వేసేస్తుంటారు. వీలైనంత గాలి, వెలుతురు ఇంట్లోకి వచ్చేలా తలుపులు, కిటికీలు తీసి ఉంచాలి. ఫ్యాన్లు, లైట్లు వినియోగాన్ని తగ్గించాలి.

* రోజువారి వేడి నీటి కోసం సోలారు హీటర్లు వాడాలి.

* పడక గదుల్లో తలుపులు, కిటికీలు ఎక్కువ సార్లు తీయకుండా ఉంటే చల్లదనం ఎక్కువ సమయం ఉంటుంది.

* పరిశ్రమల్లో మోటారు, పుల్లీలను నడిపే బెల్టును గట్టిగా బిగించాలి. పరిశ్రమలన్నింటిలోనూ ఎనర్జీ ఆడిట్‌ చేయించుకుంటే.. వృథా విద్యుత్తు వాడకాన్ని అరికట్టొచ్చు.

* మోటారు టెర్మినల్‌కు షంట్‌ కెపాసిటర్‌ అమర్చడం ద్వారా 50 శాతం విద్యుత్తును పొదుపు చేయవచ్చు.
* వ్యవసాయ విద్యుత్తు పంపు సెట్లుకు ఎక్కువ వ్యాసం గల దృఢమైన పీవీసీ పైపులు, తక్కువ ఘర్షణ గల పుట్‌ వాల్వులు, సక్షన్‌ డెలివరీ పైపులకు ఎక్కువ జాయింట్లు, బెండ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే 20 శాతం విద్యుత్తును ఆదా చేయవచ్చు. సరైన రేటింగు కెపాజిటరు అమర్చితే కరెంటు వాడకం తగ్గుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని