యువకుడిపై పోక్సో కేసు
eenadu telugu news
Updated : 15/10/2021 05:12 IST

యువకుడిపై పోక్సో కేసు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరకంగా కలిసిన యువకుడిపై గన్నవరం పోలీసులు గురువారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన పొందుగల అవినాష్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కుటుంబ సభ్యులతో విభేదించి కొంతకాలంగా స్టేషన్‌ పరిధిలోని వీఎన్‌పురం కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక(17)తో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి సదరు బాలికను శారీరకంగా కలిశాడు. మోజు తీరిన తర్వాత పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌ వివరించారు.


వివాహితపై అత్యాచారయత్నం

ఆరుగొలను(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే : పొలంలో సాయానికి అని వెళ్లిన వివాహితపై అత్యాచారయత్నం చేసిన ఘటన బాపులపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆరుగొలనులో ఇంటి ఏసు అనే వ్యక్తి.. పొలంలో మందు పిచికారీ నిమిత్తం నీళ్లు అందించడానికి సాయంగా మహిళను తీసుకెళ్లాడు. పొలానికి వెళ్లిన తర్వాత అర్ధంతరంగా మందు చల్లడం ఆపి వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె రాయితో అతడిని కొట్టి తప్పించుకొని ఇంటికి చేరుకుంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు హనుమాన్‌జంక్షన్‌ ఎస్సై ఉషారాణి వివరించారు.


యువతీ యువకులకు కౌన్సెలింగ్‌

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై అర్ధరాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువతీయువకులకు గన్నవరం పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో గన్నవరం వద్ద ఇద్దరు యువతీయువకులు అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించారు. ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలివ్వడంతో స్టేషన్‌కు తరలించారు. ప్రేమపేరుతో విశాఖపట్నం నుంచి యువతీయువకులు వచ్చినట్లు గుర్తించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం తల్లిదండ్రులు, యువతీ యువకులతో మాట్లాడి పంపించినట్లు సీఐ శివాజీ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని