చిన్ని తండ్రీ... చిరంజీవ..
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

చిన్ని తండ్రీ... చిరంజీవ..

శిశువు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు

12 గంటలలోగా తల్లిదండ్రులకు అప్పగింత

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే - గుంటూరు నేరవార్తలు, నగరంపాలెం

అమ్మ ప్రియాంక పొత్తిళ్లలో ఆడుకుంటున్న బాబు

అంగవైకల్యంతో పుట్టిన మొదటి సంతానం కొద్ది రోజులకే మృత్యువాత పడటం... తిరిగి ఐదేళ్లకు గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. నాలుగు రోజుల ఈ శిశువు శనివారం రాత్రి సుమారు 1-30 గంటల సమయంలో గుంటూరు సర్వజనాసుపత్రిలో అపహరణకు గురైంది. దీంతో ఆ తల్లి హతాశురాలయ్యింది. గంటలు గడుస్తున్నా బిడ్డ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కోమాలోకి జారుకుంటున్న సమయంలో మధ్యాహ్నం 12.20కి చిన్నారి లభ్యమయ్యాడనే విషయం తెలిసి ఒక్కసారిగా ఆమె మోములో నవ్వులు విరిశాయి.

4 గంటల దాకా శివాలయంలో!

నిందితుడు హేమవరుణుడు శిశువును తెల్లటి కర్రల సంచిలో పెట్టుకుని రాత్రి 2 గంటల సమయంలో బయటకు తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్‌ వద్ద ఓ ఆటోలో ఎక్కి నేరుగా పెదకాకాని శివాలయానికి వెళ్లారు. గుడిలో ప్రదక్షణలు చేసి 4 గంటల దాకా అక్కడే గడిపినట్లు పోలీసులకు సీసీ ఫుటేజీ లభ్యమైంది. అనంతరం తిరిగి గుంటూరు నెహ్రునగర్‌లోని మోతీలాల్‌ నగర్‌లో ఉన్న తన నివాసానికి మహిళతో కలిసి చేరుకున్నారు. నిందితుడు ఎక్కిన ఆటోను గుర్తించిన పోలీసులు కేసును ఛేదించగలిగారు.

భద్రత ఏదీ

ఇంత పెద్ద ఆసుపత్రిలో భద్రత లేదనే చెప్పాలి. ఎవరు వచ్చి, పోతున్నారో తెలియకుండా ఉంటోంది. భద్రతా సిబ్బంది పర్యవేక్షణ ఉండటం లేదు. అర్ధ, అపరాత్రి అని లేకుండా ఎవరు వస్తున్నా కనీసం ప్రశ్నించటం లేదు. వారి వెంట ఉండే సంచులను తనిఖీలు చేయటం లేదు. ఈ లోపాలను అధిగిమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శిశువును కర్ర సంచిలో తీసుకువెళ్తున హేమవరుణుడు

(సీసీ కెమెరా దృశ్యం)

ఆటోడ్రైవర్ల విచారణ

కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు పెద్ద ఎత్తున ఆటోడ్రైవర్లను పిలిచి విచారించారు. ఈ తరహా నేరాలకు పాల్పడే ముఠాలు వారి వ్యాపకంపై ఆరా తీశారు. గతంలో ఆసుపత్రిలో పనిచేసి మానేసిన ఉద్యోగుల జాబితాను తీసుకుని వారి నేపథ్యాలపై వివరాలు సేకరించారు. ఇలా అన్నికోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయటంతో కేసును గంటల వ్యవధిలోనే చేధించగలిగారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆచార్య నీలం ప్రభావతి పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

గంట ఆలస్యమైతే శిశువు ప్రాణాలకే ప్రమాదం!

ఈ ఘటనపై కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మోతీనగర్‌లో నిందితులు ఓ ఇంట్లో నిద్రిస్తుండగా పోలీసులు తలుపు తట్టారు. ఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ వరకు శిశువు కోసం రోడ్లపై ఉరుకులు, పరుగులు పెడుతుంటే నిందితుడు పూటుగా మద్యం తాగి ఓ మహిళతో ఇంట్లో నిద్రపోతున్నాడు. పోలీసులు వెళ్లి శిశువు ఎక్కడని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని బుకాయించారు. పోలీసులు లోతుగా విచారిస్తున్న క్రమంలో మస్కాకొట్టి పరారవ్వడానికి యత్నించగా అప్పటికే ఆ ఇంటి చుట్టూ పెద్దసంఖ్యలో పోలీసులు పద్మవ్యూహంలా మొహరించారు. సీఐ, ఎస్సైలు తమదైన శైలిలో విచారించగా శిశువును తామే అపహరించామని ఒప్పుకున్నారు. పసికందును ఇంటిలో అలమరల కింద దుప్పటిలో బండరాయి చాటున దాచి పెట్టడాన్ని పోలీసులు గుర్తించి సంరక్షించారు. నిందితులు ఇంటికి వేకువజాము 4 గంటలకు వచ్చారని, అప్పటి నుంచి శిశువు ఏడుపు వినిపించ లేదని సమీపంలోని పలువురు మహిళలు చెప్పారు. దీంతో శిశువు ఏడవకుండా పాలలో మత్తుమందు, మత్తు కలిగించే బిళ్లలు కలిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మత్తులో ఉన్న శిశువు బండరాయి చాటున, దుప్పటిలో మరో గంటసేపు ఉంటే ఊపిరాడక ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని భావిస్తున్నారు. సీఐ వెంటనే శిశువును జీజీహెచ్‌కు తీసుకువెళ్లి సూపరింటెండెంట్‌ ప్రభావతికి అప్పగించడంతో ఆమె వైద్య సేవలందించారు.

శిశువును దాచిపెట్టిన ప్రాంతం (మహిళ ఎడమకాలు వెనుక బండరాయి చాటున)

నిందితుల అరెస్టు

మోతీలాల్‌నగర్‌లో నిందితులు రావుల హేమ వరుణుడు, రెడ్డి పద్మలను అరెస్టు చేసి వారి వద్ద శిశువును సంరక్షించి తల్లికి అప్పగించినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని