24 గంటల్లో హత్య కేసు ఛేదన
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

24 గంటల్లో హత్య కేసు ఛేదన

వివరాలు వెల్లడిస్తున్న దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి

పల్లపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు మండలంలోని పల్లపాడులో ఇటీవల బండారు ఫణిగోపి(22) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు దక్షిణ మండల డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తెలిపారు. గుంటూరులోని ఆమె కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్‌ సూచనల మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పల్లపాడుకు చెందిన చావలి ఎల్లయ్య కుమార్తెను అదే గ్రామానికి చెందిన ఫణిగోపి అనే యువకుడు ప్రేమించాడు. వీరిద్దరూ గతంలో ఊరు వదిలి వెళ్లిపోగా.. గ్రామ పెద్దలు వీరిని పట్టుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇకపై ఎల్లయ్య కుమార్తెతో మాట్లాడవద్దని సదరు యువకుడికి వారు సూచించారు. కొన్నాళ్లు గ్రామం విడిచి వెళ్లిపోయిన గోపి కొంతకాలం కిందట స్వగ్రామానికి వచ్చాడు. తన కుమార్తెతో మళ్లీ గోపీ సన్నిహితంగా ఉంటున్నాడని భావించిన ఎల్లయ్య... ఫణిగోపిని అంతమొందించి శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. అక్టోబర్‌ 10వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన చావలి రామకృష్ణ, చావలిగోపి, గుమ్మా అప్పారావు, తాటిలింగారావు, పల్లపు సాంబయ్య, గుంజిశ్రీకాంత్‌, గుండాల నవీన్‌, చేబ్రోలు మండలం వేజండ్లకు చెందిన వలివేటి వెంకటేశ్వరరావు, బుల్లిగోర్ల వెంకటేశ్వరరావు, గుమ్మావెంకటేశ్వరరావులు కలిసి ఇంట్లో ఉన్న గోపికి ఫోన్‌చేసి వంగిపురం డొంకవైపు తాము ఉన్నామని.. పార్టీ చేసుకుందామని నమ్మబలికి రప్పించారు. అక్కడికి వచ్చిన అతన్ని సామూహికంగా దాడిచేసి హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని ముట్లూరుకు తరలించి అప్పాపురం కాలువలో పడేసినట్లు డీఎస్పీ చెప్పారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులను అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. చేబ్రోలు సీఐ మధుసూధనరావు, వట్టిచెరుకూరు ఇంఛార్జి ఎస్సై వినోద్‌కుమార్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సుభాని సమావేశంలో పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని