జయ మంగళం
eenadu telugu news
Published : 17/10/2021 03:06 IST

జయ మంగళం

చివరి రోజు లక్ష మందికి పైగా భక్తుల రాక

ఈనాడు, అమరావతి - ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే

తెప్పోత్సవానికి తరలి వస్తున్న ఉభయ దేవేరులతో స్వామివారు

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్సోత్సవాలు ముగిశాయి. అధికారుల అంచనాలను దాటి భారీ సంఖ్యలోనే భక్తులు ఉత్సవాలకు తరలివచ్చారు. తొమ్మిది రోజుల్లో 4.50లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూలానక్షత్రం, ఉత్సవాల చివరి రోజున భక్తుల సంఖ్య లక్ష దాటింది. శుక్రవారం దసరా రోజు దుర్గగుడిలో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. క్యూలైన్లలో ఉండే భక్తుల నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమోగింది. కొండ దిగువన వినాయక మండపం దగ్గర క్యూలైన్లలోనికి ప్రవేశించి రెండున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ పైకి వచ్చి దర్శనాలు చేసుకోవడానికే ఆపసోపాలు పడాల్సి వస్తుంది. అలాంటిది.. యథేచ్ఛగా పాస్‌లు, ప్రత్యేక టిక్కెట్లను ముద్రించుకుని జమ్మిదొడ్డి సహా ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వీఐపీ దర్శనాలకు దర్జాగా వాహనాల్లో తరలిరావడంతో సాధారణ భక్తులకు చుక్కలు కనిపించాయి. వాహనాల్లో వచ్చేవారంతా నేరుగా వెళ్లిపోయి అంతరాలయం దర్శనాలు చేసుకుంటూ వస్తున్నా.. అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. దసరా ఉత్సవాల చివరి రోజున తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ అధికంగానే ఉంది. ఉదయం 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు లక్ష మందికి పైగా భక్తులు రాజరాజేశ్వరీదేవిని దర్శించుకున్నారు. ఆరో రోజు మూలానక్షత్రం సందర్భంగా 1.20లక్షల మందికి పైగా భక్తులు వచ్చారు. ఏడో రోజు రద్దీ కొనసాగింది.. 60వేల మంది వరకు దర్శనం చేసుకున్నారు. ఎనిమిదిరోజు బాగా రద్దీ తగ్గింది. 15వేల మంది వరకు మాత్రమే దర్శనం చేసుకున్నఆరు. తొమ్మిదో రోజు దసరా సందర్భంగా మళ్లీ లక్ష దాటారు. అధికారుల అంచనాల ప్రకారం.. రోజుకు పది వేలు, మూలానక్షత్రం రోజున రెట్టింపు వేసుకున్నా.. లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ.. 4.50లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కొవిడ్‌కు ముందు వరకు దసరా వేడుకల్లో 10 నుంచి 12లక్షల మంది వరకు భక్తులు దర్శనాలు చేసుకునేవారు. తొమ్మిది రోజులుగా నిర్వహించిన ప్రత్యేక చండీయాగం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రుత్వికులు నిర్వహించారు.

కృష్ణవేణి ఘాట్‌లో జల్లు స్నానాలు చేసేందుకు కిక్కిరిసిన భవానీలు

హంసవాహనంలో కలెక్టర్‌, మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే విష్ణు, దేవస్థానం అధికారులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని