ఏసీబీ వలలో కంభంపాడు వీఆర్వో
eenadu telugu news
Updated : 17/10/2021 05:29 IST

ఏసీబీ వలలో కంభంపాడు వీఆర్వో

రూ.55 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

ఏసీబీకి చిక్కిన కంభంపాడు-1 వీఆర్వోవెంకటశివరావు

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: లంచాలకు అలవాటు పడిన కొందరు ఉద్యోగులు సామాన్యులకు పనులు చేయాలంటే పీడిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జీతం కంటే పై సంపాదనకు అలవాటు పడిన ఓ అధికారి రైతుకు పనిచేసేందుకు చుక్కలు చూపించాడు. తమ పొలానికి పాసుపుస్తకం కోసం ఆ అధికారిని వేడుకున్నారు. నగదు ఇవ్వాల్సిందేనని చెప్పడంతో గత్యంతరం లేక సదరు రైతు ఏసీబీని ఆశ్రయించగా వలపన్ని వీఆర్వోను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ పీవీవీ ప్రతాప్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పిట్టల నర్సయ్య తండ్రి పెదనాగయ్యకు ఎకరా 67 సెంట్ల డీకే పట్టా పొలం ఉంది. వీటికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఎక్కించారు. ఇంతవరకు పాసు పుస్తకం లేదు. గతనెల 21న పాసుపుస్తకం కోసం నర్సయ్య అర్జీ పెట్టుకున్నారు. నివేదిక తహశీల్దారుకు అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 65 వేలు ఇవ్వాలని కంభంపాడు-1 వీఆర్వో కలేటి వెంకటశివరావు డిమాండ్‌ చేశాడు. నర్సయ్య తాను అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడటంతో రూ.55 వేలకు వీఆర్వో తగ్గించాడు. శనివారం నర్సయ్య కంభంపాడు శివారు గ్రామమైన జింకలబోడులోని వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దకు వీఆర్వోను డబ్బులు తీసుకునేందుకు రావాలని చెప్పడంతో వీఆర్వో అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు వీఆర్వో వెంకటశివరావు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పాలువాయి సచివాలయం, మాచర్ల తహశీల్దారు కార్యాలయంలో వీఆర్వోను విచారించారు. అనంతరం ఆయన్ను గుంటూరుకు తరలించారు. ఏసీబీ దాడుల్లో డిఎస్పీతోపాటు ఏసీబీ సీఐలు రవిబాబు, నాగరాజు, శ్రీధర్‌, మన్మధరావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

డబ్బులివ్వందే పనులు చేయడం లేదు : బాధితుడు

డబ్బులివ్వనిదే పనులు చేయడం లేదని బాధితుడు పిట్టల నర్సయ్య పేర్కొన్నారు. నాన్నకు చెందిన ఎకరా 67 సెంట్ల డీకే భూమి ఉందన్నారు. ఆన్‌లైన్‌లో 1బీ అడంగల్‌ పట్టా వచ్చిందన్నారు. గతనెలలో వీఆర్వోను కలిస్తే రూ.65 వేలు అడిగారని, ప్రాధేయపడితే రూ.55 వేలు ఇవ్వమని చెప్పారన్నారు. దీంతో ఏసీబీని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని