పండగ పూట చిరు వ్యాపారిని బలిగొన్న కారు
eenadu telugu news
Published : 17/10/2021 03:18 IST

పండగ పూట చిరు వ్యాపారిని బలిగొన్న కారు

మృతుడు రాము (పాత చిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: పట్టణంలో దసరా పండగవేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కారు రోడ్డు మార్జిన్‌లో ఉన్న చిరువ్యాపారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన స్థానిక గడియార స్తంభం కూడలికి సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం దద్దాళమ్మ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న సింగిరెడ్డి రాము(45) తన కుటుంబసభ్యులతో కలిసి మిఠాయిలు, తిను బండారాలు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో ఉన్న రామును పొదిలి వైపు వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలై రాము అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా వెళ్లిపోయింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం వెల్తిపాడు గ్రామానికి చెందిన రాము దాదాపు 20 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం దర్శికి వచ్చారు. పండగ పూట ఇంటి పెద్ద మరణించటంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధించారు. శనివారం ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, చోదకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్‌ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని