చేపల కోసం వల వేస్తే.. కొండచిలువ చిక్కింది
eenadu telugu news
Published : 17/10/2021 03:18 IST

చేపల కోసం వల వేస్తే.. కొండచిలువ చిక్కింది

వలలో చిక్కుకున్న కొండ చిలువ

పెనమలూరు, న్యూస్‌టుడే: చేపల కోసం వల వేస్తే కొండ చిలువ చిక్కిన ఘటన పెనమలూరు మండలం పెదపులిపాక కృష్ణా నది వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం కొందరు మత్స్యకారులు చేపల వేట కోసం పెదపులిపాకకు వచ్చారు. నదిలో వల ఏర్పాటు చేసి మరుసటి రోజు శుక్రవారం వచ్చారు. పడవలో వెళ్లి వల బయటకు తీసేందుకు ప్రయత్నించగా విపరీతమైన బరువుతో ఉండటంతో అనుమానం వచ్చింది. పెద్ద చేప చిక్కినట్లు తొలుత భావించగా వలలో కదలికలను బట్టి వారికి అనుమానం వచ్చింది. మరింత మంది తోటి మత్స్యకారులను పిలిచి వలను పడవలకు కట్టి ఒడ్డుకు లాక్కు రాగా.. అందులో 15 అడుగుల కొండ చిలువ చిక్కుకుపోయి ఉండడంతో బెంబేలెత్తిపోయారు. దానిని వల నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి పామును స్వాధీనం చేసుకున్నారు. నదికి వస్తున్న వరదలకు ఎగువ భాగంలోని అడవుల నుంచి ఇది కొట్టుకువచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది దీనిని కొండపల్లి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని