పంటల బీమా పరిహారం అక్రమాలపై విచారణ
eenadu telugu news
Published : 17/10/2021 03:18 IST

పంటల బీమా పరిహారం అక్రమాలపై విచారణ

మైలవరం, న్యూస్‌టుడే: పంటల బీమా పరిహార జాబితాలను ముందుగానే రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రదర్శించామని, అప్పట్లో ఎటువంటి ఆరోపణలు రాలేదని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు మోహనరావు వెల్లడించారు. మండలంలోని పుల్లూరులో ఇటీవల వెలుగు చూసిన బీమా పరిహారం అక్రమాల నేపథ్యంలో అధికారుల కమిటీతో కలిసి శనివారం పుల్లూరులో పర్యటించారు. అక్కడి పంచాయతీ కార్యాలయంలో సమావేశమై, జాబితాలు పరిశీలించారు. పలువురు రైతులు అక్రమాలు జరిగాయంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జేడీఏ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రూ.170 కోట్ల పరిహారం విడుదలైనట్లు చెప్పారు. రూ.2 లక్షల పైబడిన పరిహార చెల్లింపులు ఇంకా పూర్తి కాలేదని, ఆయా జాబితాలపై ఆరోపణల నేపథ్యంలో పునఃవిచారణ చేస్తామన్నారు. ప్రతి పనికి సోషల్‌ ఆడిట్‌ ఉంటుందని, పరిహారం జాబితాల విషయంలోనూ నిబంధనల మేరకు జాబితాల ప్రదర్శన చేసినట్లు చెప్పారు. జాబితాలను రైతులు చూసుకున్నారని, అప్పట్లో ఎటువంటి ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పుల్లూరులో ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రామంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, సిబ్బందిని లాగిన్‌లను అధికార పార్టీ వ్యక్తులకు ఇచ్చారన్న ఆరోపణలను ప్రస్తావించగా.. లాగిన్‌ వేరే వారితో చేయడం కుదరదని అన్నారు. ప్రస్తుతం పండించిన పంటకు బదులు వేరే పంట నమోదు తేడాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆధార్‌ కార్డుల తారుమారు చేసిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని, ఇందులో అక్రమాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జేడీ వివరించారు. అధికారుల బృందంలో అసిస్టెంట్‌ జేడీఏ ఎన్‌.మణిధర్‌, ఏడీఏ వెంకటేశ్వరరావు, ఏఓ వేణుమాధవ్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని