నడకకు మార్గమేదీ..?
eenadu telugu news
Updated : 18/10/2021 10:59 IST

నడకకు మార్గమేదీ..?

మైదానాల్లో దొరకని అనుమతి

రోడ్లపై నడుస్తుండడంతో కాళ్లు, కీళ్ల నొప్పులు

ఈనాడు, అమరావతి

విజయవాడ నగరంలోని వాకర్స్‌ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. రోజూ ఉదయాన్నే ఓ అరగంట నడిస్తే తప్ఫ. ఆ రోజు నిద్ర పట్టని పరిస్థితి చాలామందికి ఉంది. కొవిడ్‌ నేపథ్యంలో నగరంలోని స్టేడియాలు, కళాశాలలు, పాఠశాలల మైదానాల్లోకి వాకర్స్‌ను అనుమతించకుండా ఆపేశారు. దీంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఇళ్లలో, టెర్రాస్‌లు, కాలనీ రోడ్లు, ప్రధాన రహదారుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వాకింగ్‌ చేసుకుంటున్నారు. ఆగస్టు నుంచి కొవిడ్‌ కేసులు తగ్గడంతో జనజీవనం సాధారణ పరిస్థితికి వస్తోంది. వాణిజ్య, వ్యాపార సముదాయాలు సహా అన్నీ తెరిచేశారు. కానీ వాకర్స్‌కు మాత్రం నడిచేందుకు అనుమతి ఇవ్వకుండా ఇప్పటికీ నిబంధనలు పెడుతున్నారు.

విజయవాడ నగరంలో 20కు పైగా వాకర్స్‌ అసోసియేషన్లున్నాయి. ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే పది వేల మందికి పైగా వాకర్స్‌ ఉన్నారు. పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లో మరో 15వేల మందికి పైనే వాకర్స్‌ ఉన్నారు. దశాబ్దాలుగా రోజూ ఉదయాన్నే లేచి అరగంట నుంచి గంట సమయం నడవడం జీవనంలో భాగమైపోయింది. అలాంటిది కొవిడ్‌ దెబ్బకు ఒక్కసారిగా తమ దినచర్య గతి తప్పింది. ప్రస్తుతం పరిస్థితులు సర్దుకున్నా అటు అధికారులు, ఇటు విద్యా సంస్థల నిర్వాహకులు వాకర్స్‌ను అనుమతించకపోవడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో మైదానంలో వేల మంది..

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం, లయోలా, సిద్థార్ధ ఇలా.. ప్రతిచోటా వేల మంది వాకర్స్‌ ఉన్నారు. సొంతంగా నిధులు ఏర్పాటు చేసుకుని.. వాటితో మైదానాల్లో ట్రాక్‌లను కూడా మట్టితో వేయించుకున్నారు. ఒక్కో మైదానానికి ప్రత్యేక అసోసియేషన్‌లు ఉన్నాయి. ఒక్కో అసోసియేషన్‌లో రెండు నుంచి 3వేల మంది వాకర్స్‌ ఉన్నారు. తాము జాగ్రత్తలు తీసుకుంటూనే వాకింగ్‌ చేసుకుంటామంటూ సంఘాల ప్రతినిధులు కోరుతున్నా విద్యా సంస్థల నిర్వాహకులు అంగీకరించడం లేదు. విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు అనుమతి ఇవ్వకపోవడం వల్లే తామూ అంగీకరించడం లేదని ఓ కళాశాల నిర్వాహకులు వెల్లడించారు.

వాకింగ్‌కు ప్రత్యేకంగా ఉండాలి..

వాకింగ్‌ అనేది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. కచ్చితంగా మట్టి, పచ్చిక ప్రదేశాల్లో నడవాలి. తారు, సిమెంట్‌ రోడ్లపై అస్సలు నడవకూడదు. కానీ ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై నడుస్తుండడంతో మోకాళ్లు, కీళ్ల నొప్పుల బారినపడేవాళ్లు పెరిగిపోతున్నారు. శరీరానికి వ్యాయామం కోసం చేసే నడక తమకు మరిన్ని అనారోగ్య సమస్యల బారినపడేలా చేస్తోందని పలువురు వాకర్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు వాపోతున్నారు. ఇప్పటికే నగరంలోని కొందరు ప్రజాప్రతినిధులను కూడా కలిసి తమ సమస్యను అర్థం చేసుకుని అనుమతి ఇచ్చేలా చూడాలని కోరినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలు కూడా తెరిచేసిన నేపథ్యంలో తమకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని కోరుతున్నారు.


 

మోకాళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది..

నడిచేటప్పుడు ఒంటి కాలిపైనే శరీరం బరువు మొత్తం పడుతుంది. వాకింగ్‌ చేసేటప్పుడు శరీర బరువు మొత్తం ఒకేసారి కాలి ద్వారా నేలపైన పడుతుంది, ఆ సమయంలో భూమి నుంచి కూడా అంతే ఫోర్స్‌గా రియాక్షన్‌ వస్తుంది. దీనినే జాయింట్‌ రియాక్షన్‌ ఫోర్స్‌ అంటారు. మట్టి నేలపై, ఇసుకలో, గడ్డిలో నడిచేటప్పుడు శరీరం నుంచి వచ్చే ఒత్తిడిని భూమి తనలోకి తీసుకుంటుంది. తిరిగి వెనక్కి కొట్టదు. అదే సిమెంట్‌, తారు రోడ్లు లాంటి గట్టిగా ఉండే వాటిపై నడిచేటప్పుడు భూమి నుంచి జాయింట్‌ రియాక్షన్‌ ఫోర్స్‌ రెట్టింపు స్థాయిలో శరీరంపైకి వస్తుంది. దానివల్ల ప్రధానంగా మోకాళ్లు దెబ్బ తింటాయి. ఒకేసారి రివర్స్‌లో ఒత్తిడి శరీరంపైకి వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారులపై వాకింగ్‌ చేయకూడదు.

- డాక్టర్‌ గుడారు జగదీష్‌, ఎముకల వైద్య నిపుణులు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని