విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్‌ స్టేషన్లు
eenadu telugu news
Updated : 18/10/2021 11:35 IST

విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్‌ స్టేషన్లు

30 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

- ఈనాడు, అమరావతి

విద్యుత్తు వాహనాలు పెరిగితే వాహన కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌2 పథకం కింద వివిధ రాయితీలను అందిస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్తు వాహనాలు ఇస్తుండడంతో ఛార్జింగ్‌ స్టేషన్ల అవసరం వస్తోంది. ఇందుకోసం పలుచోట్ల స్టేషన్లు ఏర్పాటు చేయాలని నెడ్‌క్యాప్‌, ఈఈఎస్‌ఎల్‌, ఎన్టీపీసీ నిర్ణయించాయి. దీనికి స్థలాలను పరిశీలిస్తున్నారు. తొలుత.. ప్రధాన కేంద్రాలు, జాతీయ రహదారులకు రెండు వైపులా, తర్వాత ప్రాధాన్యతగా మండల కేంద్రాలను ఎంపిక చేయనున్నారు. స్టేషన్లకు 85 చ. గజాల మేర స్థలం అవసరం అవుతుంది. లీజు పదేళ్ల పాటు అమలులో ఉంటుంది. ప్రస్తుతానికి 18 ప్రభుత్వ రంగ సంస్థలు, 12 మంది ప్రైవేటు వ్యక్తులు స్థలం లీజుకు సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో వీటిని సర్వే చేసి ఖరారు చేయనున్నారు. పెనమలూరు, గుడివాడ, గూడూరు, విజయవాడ ఆటోనగర్‌, హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని టోల్‌ప్లాజా, గన్నవరంలోని ఆర్టీఏ కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, ఆర్టీసీ పాతబస్టాండు, తదితర ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. ఉద్యోగులకు ఇవ్వనున్న ఈ- వాహనాల వేగం 45 నుంచి 55 కి.మీ. ఒకసారి పూర్తి ఛార్జి చేస్తే.. 80 నుంచి 100 కి.మీ నడుస్తుంది. ఫుల్‌ ఛార్జికి మూడు యూనిట్లు విద్యుత్తు వినియోగం అవుతుంది. నెలకు రూ.2వేలు చొప్పున 60 నెలల పాటు ఈఎంఐ చెల్లించే వెసులుబాటు ఇవ్వనున్నారు. వారి నెల జీతం నుంచే వాయిదా సొమ్ము మినహాయించనున్నారు. స్టేషన్‌ ద్వారా వచ్చే ఆదాయంలో ఏర్పాటు చేసిన సంస్థకి, స్థల యజమానికి చెరి సగం ఇస్తారు.

ముందుకొస్తున్న స్థల యజమానులు

విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్‌ కోసం ప్రత్యేకంగా స్టేషన్లు రానున్నాయి. జిల్లాలో వీటిని 30 చోట్ల ఏర్పాటు చేసేందుకు స్థల యజమానులు ముందుకొచ్చారు. ప్రాథమిక దశలో ఉన్న ఇవి త్వరలో సాకారం కానున్నాయి. విద్యుత్తు వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నెడ్‌క్యాప్‌ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలిసి అందరు ప్రభుత్వ ఉద్యోగులకు సులభ వాయిదాల్లో అందజేయనుంది. ద్విచక్ర వాహనాల సరఫరా కోసం ఇప్పటికే సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఈఈఎస్‌ఎల్‌, ఎన్టీపీసీతో చర్చలు జరిపింది. ప్రస్తుతం 10 కంపెనీల మోడళ్లను పరిశీలించారు. ఆసక్తి కలిగిన ఉద్యోగుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇందుకోసం నెడ్‌క్యాప్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తోంది. ఇది వచ్చే నెల 15వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. దీని ద్వారానే ఉద్యోగులు విద్యుత్తు వాహనాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

రెట్రోఫిట్‌ కిట్లు

విజయవాడలో వాయి కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కార్పొరేషన్‌కు తొలి విడతగా రూ.37కోట్లు కేటాయించింది. నెడ్‌క్యాప్‌ తోడ్పాటును వీఎంసీ తీసుకుంటోంది. ప్రధానంగా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో డీజిల్‌ ఆటోలకు బ్యాటరీ కిట్లను అమర్చనున్నారు. ఇందుకోసం రూ.1.5 కోట్లను వెచ్చించనున్నారు. నగరంలో మూడు ప్రాంతాలను ఛార్జింగ్‌ స్టేషన్ల నిర్మాణానికి ఎంపిక చేశారు. దీనికి టెండర్లు పిలిచారు. గుత్తేదారు ఎంపిక అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి. ప్రయోగాత్మకంగా నెడ్‌క్యాప్‌ 50 ఆటోలకు కిట్లను అమర్చి ఈ-ఆటోలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టనుంది. వీటిని అమర్చే కంపెనీ నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. వాహనాల సంఖ్య పెరిగితే స్వాపింగ్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. వీటిల్లో పూర్తి ఛార్జి చేసిన బ్యాటరీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఛార్జింగ్‌ అయిన బ్యాటరీలను అక్కడ ఇస్తే ఫుల్‌ ఛార్జింగ్‌ ఉన్న వాటిని తీసుకోవచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని