పదోన్నతులకు కసరత్తు
eenadu telugu news
Published : 18/10/2021 04:30 IST

పదోన్నతులకు కసరత్తు

కృష్ణాలో ప్రధానోపాధ్యాయ ఖాళీలు 60

జాబితా సిద్ధం చేసిన జిల్లా విద్యాశాఖ

ఈనాడు, అమరావతి

కృష్ణా జిల్లాలో ఉపాధ్యాయ పదోన్నతుల కసరత్తు ఆరంభమైంది. జిల్లాలో ఖాళీల జాబితాను సిద్ధం చేశారు. సీనియారిటీ వారీగా పదోన్నతులను కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రక్రియను ఆరంభించారు. ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే లెక్కలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఆదివారం కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ డీఈవో కార్యాలయంలో చేపట్టారు. గత ఏడాది నవంబర్‌ నుంచి పదవీ విరమణలు చేయడం ద్వారా ఏర్పడిన ఖాళీలను ప్రస్తుతం పూరించనున్నారు. మృతి చెందిన, పదోన్నతులు సాధించిన వారికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు.

జిల్లాలో 11వేల మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 60 ప్రధానోపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. వీటిలో జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఖాళీలు 54, ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు ఉన్నాయి. సెకెండ్‌ గ్రేడ్‌ టీచర్లకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీల జాబితా కూడా సిద్ధమైంది. ఎస్‌ఏ గణితం 11, భౌతికశాస్త్రం 11, బయాలాజికల్‌ సైన్స్‌ 28, సాంఘిక శాస్త్రం 56, ఇంగ్లీష్‌ 25, తెలుగు 20, హిందీ 12, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 08, ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయులు 83 ఉన్నాయి. వీటిలో తెలుగు 79, ఉర్దూ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సీనియార్టీ జాబితా ప్రదర్శన..

అర్హులను ఎంపిక చేసేందుకు సీనియార్టీ జాబితాలను ఇప్పటికే ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజులు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 21, 22 తేదీల్లో అప్పీళ్లను పరిశీలించి పరిష్కరిస్తారు. అనంతరం అక్టోబర్‌ 23న సీనియార్టీ తుది జాబితాను విడుదల చేస్తారు. సీనియారిటీ ఆధారంగా పదోన్నతుల కౌన్సెలింగ్‌ను గ్రేడ్‌ 2 ప్రధానోపాధ్యాయులకు 25న నిర్వహిస్తారు. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అక్టోబర్‌ 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్‌ చేపడతారు. పదోన్నతులకు సంబంధించిన మొత్తం ప్రక్రియ సజావుగా సాగుతోందని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని