చిత్ర వార్తలు
eenadu telugu news
Updated : 18/10/2021 04:54 IST

చిత్ర వార్తలు

శ్రద్ధగా ధారణ... ఇలాగా విరమణ...


తరలివస్తున్న భవానీలు

భవానీ మాల వేసుకున్న భక్తులు ఎంతో పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో దుర్గమ్మను ఆరాధిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ సారి ఇరుముడులు ఎక్కడికక్కడ ఆలయాల్లో సమర్పించాలని అధికారులు ప్రకటన చేశారు. ఇది తెలియని వేలాది మంది భవానీలు ఇంద్రకీలాద్రికి వచ్చారు. అయితే తీసుకొచ్చిన ఇరుముడి బియ్యం ఎక్కడ ఉంచాలనేది స్పష్టత లేకపోవడంతో మల్లికార్జున స్వామి ఆలయం కింద మెట్ల మార్గం వద్ద ఓ మూలన అందరూ పోసేస్తున్నారు. అధికారులు ఇరుముడులకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.


మాలను విరమింపజేస్తూ...

అమ్మను స్మరించుకుంటూ..

-ఈనాడు, అమరావతి


బొమ్మలకు కరోనా ‘దిష్టి’

ఈ చిత్రంలో బండి నడుపుతున్న చిరు వ్యాపారి పేరు బలరాందాస్‌. చాలా కాలం కిందటే జీవసనోపాధి కోసం విజయవాడకు వలస వచ్చారు. కరోనాకు ముందు దిష్టి బొమ్మలకు బాగా గిరాకీ ఉంది. రోజూ కనీసం 10 బొమ్మలైనా అమ్ముడయ్యేవి. కరోనాతో ఏడాదిన్నరగా నిర్మాణాలు చాలా వరకు తగ్గాయి. ఈ ప్రభావం తన జీవనోపాధిపై పడిందని బలరాందాస్‌ వాపోతున్నారు. ఆశతో బతుకు బండిని లాగుతున్నట్లు తెలిపారు.

- న్యూస్‌టుడే, కంకిపాడు


ఇక్కడ ఇళ్లెలా కట్టాలి?

 

జనగన్న కాలనీల్లో లేఅవుట్‌ పనులు పూర్తిచేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జి.కొండూరు సమీపంలో విజయవాడ వాసులు, వెలగలేరు గ్రామాల పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల్లో ఇలా వాననీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ ఇళ్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

- ఈనాడు, అమరావతి


వృథాగా పడేశారు...

 

కూడళ్లలో ట్రాఫిక్‌ సిబ్బంది విధుల నిర్వహించే ఉపయోగించే ట్రాఫిక్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టులను నాలుగు నెలలుగా కృష్ణలంక పాతపోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న పార్కులో ఇలా పడి ఉన్నాయి. చెత్తాచెదారాల మధ్య ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. రాత్రిపూట మందుబాబులు వీటిల్లో కూర్చుని మద్యం తాగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరముంది.

- ఈనాడు, అమరావతి


మురుగు మధ్యే జీవనం.. దోమలతో సహవాసం..!

 

ఇటీవల కురిసిన వర్షాలకు మంగళగిరిలోని శివారు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి చేరిన నీరు ఇప్పటికీ తొలగక పచ్చటి తెట్టుకట్టింది. పావురాల కాలనీవాసులు ఇళ్లల్లో ఉండలేక తాళాలు వేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దోమలు విజృంభిస్తున్నాయని, అధికారులకు చెప్పినా నీటిని మీరే తొలగించుకోమని చెప్పారని కాలనీవాసులు వాపోతున్నారు.

- ఈనాడు, మంగళగిరి(అమరావతి)


ఆగిన పనులు... అమ్మకు అవస్థలు...


గుంటూరు ఆస్పత్రి కాన్పుల వార్డులో దుస్థితిది. ఒకే మంచంపై ఇద్దరు బాలింతలు ఎటూ కదల్లేని స్థితిలో బిడ్డలతో కలిసి పడుకోవాల్సి వస్తోంది.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లుల కష్టాలు వర్ణనాతీతం. కాన్పుల వార్డులో ఒక్కో పడకపై ఇద్దరేసి తల్లులను ఉంచి అసౌకర్యంగా వైద్యసేవలు అందించడం ఇక్కడ నిత్యకృత్యమే. అయినా ఉన్నతాధికారులకు వీరి అవస్థలు పట్టడం లేదు. ఏళ్లు గడుస్తున్నా జీజీహెచ్‌లో మాతా-శిశు సంరక్షణ కేంద్రం భవనం నిర్మాణానికి నోచుకోవడం లేదు. అది పూర్తయ్యే వరకు ఆస్పత్రిలో తల్లులకు కష్టాలు తప్పేలా లేవు. వారు పడకపై కనీసం కాలు కదపడానికి అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని నిర్మాణానికి నిర్దేశించుకున్న గడువు పూర్తయినా ఇప్పటి దాకా పునాదులు దాటలేదు.

పునాదుల్లోనే భవన నిర్మాణ పనులు

-ఈనాడు గుంటూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని