‘డ్వాక్రా సంఘాలను మోసగించిన చంద్రబాబు’
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

‘డ్వాక్రా సంఘాలను మోసగించిన చంద్రబాబు’

మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని

గొల్లపూడి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసాలకు 14 ఏళ్లు బలి అయ్యారని, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని మహిళలను మోసగించారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆసరా వారోత్సవాల్లో భాగంగా ఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ పక్కన పెట్టేసేవారని తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసత్యాలు ప్రచారం చేస్తూ ఉంటారని, వాస్తవాలు చెప్పేందుకు తాను, శాసన సభ్యుడు వంశీ ఫోన్లు చేసినా స్పందించడం లేదన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గానికి పదేళ్లు శాసనసభ్యుడిగా ఉండి, గొల్లపూడిలో నివాసం ఉన్న ఉమామహేశ్వరరావు ఏ పని చేయలేదని, కమీషన్లు వచ్చే రహదారులు, ఇతర పనులు చేశారని ఆరోపించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఉమా మంత్రిగా ఉన్నప్పుడు రూ.65 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన చెబుతుంటారని, కానీ గొల్లపూడి వాసులకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. గొల్లపూడిలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కార్యక్రమాల కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురాం పేర్కొన్నారు. అంతకుముందు శ్రీనివాసనగర్‌లో గ్రామ సచివాలయం, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ప్రారంభించారు. విజయవాడ గ్రామీణ మండలం పరిధిలోని 699 డ్వాక్రా సంఘాలకు రూ.6.92 కోట్ల చెక్కు అందజేశారు. శాసన సభ్యులు జోగి రమేష్‌, కైలే అనిల్‌కుమార్‌, శాసన మండలి సభ్యులు కల్పలతరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ ఉప్పాల హారిక, జేసీలు మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌.ప్రవీణ్‌చంద్‌ పాల్గొన్నారు.

విచారణకు సిద్ధం: తెదేపా

గొల్లపూడిలో రూ.కోట్ల అవినీతి జరిగిందని అసత్యాలు చెబుతున్నారని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని గ్రామ మాజీ ఉప సర్పంచి నూతులపాటి వెంకటేశ్వరరావు, గ్రామ అధ్యక్షుడు నర్రా వాసు పేర్కొన్నారు. ఆదివారం వారు గొల్లపూడిలో విలేకర్లతో మాట్లాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని