19న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం
eenadu telugu news
Published : 18/10/2021 04:56 IST

19న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం

100 రోజుల పాటు కార్యక్రమాలు

జిల్లా పరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ఈనెల 19న జిల్లాలో ప్రారంభం కానుంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో ప్రారంభించనున్నారు. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినాతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులను హాజరవ్వాలని ఆహ్వానించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ జిల్లాకు కేటాయించిన 30 ఆటోలను జడ్పీ కార్యాలయం నుంచి మార్కెట్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామాలకు తీసుకెళతారు. మండల స్థాయిలో ఈనెల 20న, గ్రామ స్థాయిలో 21న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 22వ తేదీ నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలను చేపట్టి 100 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం గ్రామాల్లో వీధులను, మున్సిపాలిటీల్లో వార్డులను శుభ్రం చేయడంతో పాటు కాలువలు, డ్రెయిన్లను బాగు చేస్తారు. 100 రోజుల్లో గ్రామాలు, మున్సిపాలిటీలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశించింది. రోజూ ఏం పనులు చేశారనే వివరాలను జేఎస్‌ఎస్‌ మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా పనులు ఎలా జరుగుతున్నాయనేది ఉన్నతాధికారులకు తెలిసే అవకాశముంది. ఎక్కడైతే ప్రగతి కనపించలేదో సంబంధిత ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీల కార్యదర్శులతో మాట్లాడి పనులు వేగిరంగా జరిగేలా మార్గదర్శకం చేస్తారు. జిల్లాలో ఇప్పటికే పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం అమలుకు ఏర్పాట్లను చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని