పట్టుకెళ్తే.. పట్టిస్తుంది!
eenadu telugu news
Updated : 18/10/2021 11:41 IST

పట్టుకెళ్తే.. పట్టిస్తుంది!

ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ అమలుకు మీనమేషాలు

ఈనాడు, అమరావతి

ఇటీవల జీజీహెచ్‌లో అపహరణకు గురైన శిశువు

గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో రెండు రోజుల క్రితం శిశువు మాయం ఘటన సంచలనమైంది. నాలుగు రోజుల శిశువును ఓ వ్యక్తి ఆసుపత్రి నుంచి అపహరించుకెళ్లినా ఏ స్థాయిలోనూ గుర్తించలేదు. అదృష్టవశాత్తు శిశువు అపహరణను పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి సురక్షితంగా తల్లి ఒడికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. ఇలాంటి ఉదంతాలు ఆస్పత్రిలో కొత్తేమీ కాదు. ఇవి వెలుగులోకి వచ్చినప్పుడే యంత్రాంగానికి రక్షణ చర్యలు గుర్తుకొస్తాయి. వీటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) ట్యాగ్‌లు వేసి శిశు రక్షణ చర్యలు చేపట్టే విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో ప్రారంభించింది. కొన్నాళ్ల పాటు బాగానే అమలైనా ఆ తర్వాత అటకెక్కింది.

నెలకు వెయ్యికి పైగా ప్రసవాలు

సగటున రోజుకు 30-40 డెలివరీలు అయ్యే జీజీహెచ్‌లో శిశువుల తారుమారు, అపహరణ యత్నాలు వంటివి అనేకం వెలుగుచూస్తున్నా యంత్రాంగం పటిష్ఠమైన రక్షణ చర్యలు చేపట్టలేకపోతోందనే విమర్శలను మూటగట్టుకుంటోంది. నెలకు వెయ్యికి పైగా కాన్పులు జరిగే ఆసుపతిల్రో ఇలాంటి ఉదంతాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఆసుపత్రిపై ఉంది.

ఏమిటా విధానం?

ఐఐటీ గాంధీనగర్‌ విద్యార్థులు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు పని చేయడానికి ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.

* దేశంలో అనేక కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు ఆ సాప్ట్‌వేర్‌ సహాయంతో ట్యాగ్‌లు వేసే విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి ఈ విధానం అమలు చేయటానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్లు, రీడర్లు, స్కానర్లు, అలారం బెల్స్‌, ట్యాగ్‌లు కొనుగోలు చేసి అందజేసింది. వాటిని కొన్నాళ్ల పాటు తల్లీ బిడ్డలకే కాదు.. వారికి వైద్యసేవలు అందించే నర్సు, ఆయాలకు సైతం తొడిగి శిశు సంరక్షణకు చర్యలు తీసుకుంది.

* ఎప్పుడైతే ఈ ట్యాగ్‌లు వేసే విధానం కనుమరుగైందో ఆనాటి నుంచే శిశువులు అపహరించే ముఠాలు ఆసుపత్రిలోనే తచ్చాడుతూ శిశువులను సులభంగా అపహరించుకుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

* కొందరు తల్లులు వెంటనే మేల్కొని ఇలాంటి ముఠాల బారిన శిశువులు పడకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

* ట్యాగ్‌ శిశువు చేతికి ఉంటే వార్డు దాటి ఎవరైనా బయటకు తీసుకొస్తే చాలు వార్డులో అలారం మోగుతుంది. దీంతో వెంటనే తల్లితో పాటు వార్డులో ఉండే భద్రతా సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమవ్వడానికి ఆస్కారం ఉంది. ఇలా శిశువుల అపహరణను ఈ ట్యాగ్‌లు సులభంగా పట్టిస్తాయి.

* ఒకవేళ ఆ శిశువుకు అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడి కొత్త వైద్యులు, సిబ్బంది వచ్చి ఆ శిశువును ముట్టుకున్నా ట్యాగ్‌ నుంచి శబ్దం వస్తుంది. వారు ట్యాగ్‌ ధరిస్తే తప్ప వైద్యం చేయలేరు.

* పిల్లలు, కాన్పులు, గర్భిణుల వార్డుల్లో వార్డు ప్రవేశం నుంచి బయటకు వెళ్లే దాకా నలువైపులా రీడర్లను అమర్చుతారు. ఇది శిశువు అపహరణ, తారుమారు వంటి వాటిని రీడ్‌ చేస్తుంది.

* శిశువు తల్లి, వైద్యసేవలు అందించే నర్సు, ఆయాలు మినహా ఎవరైనా బిడ్డను బయటకు తీసుకెళ్తే ఆ రీడర్ల నుంచి వెంటనే బీప్‌ శబ్దం వస్తుంది. ఇలా శిశు అపహరణలను గుర్తించడానికి వీలవుతుంది.

ట్యాగ్‌లో ముఖ్యమైన అంశాలివీ..

* ఒకవేళ శిశువు చేతికి వేసిన ట్యాగ్‌ను తెంచి బయటకు తీసుకెళ్లదామన్నా అది తెగదు. కత్తెరతో కట్‌ చేయాల్సిందే.

* ఒకసారి వినియోగించిన ట్యాగ్‌ తిరిగి పనిచేయదు. గరిష్ఠంగా రెండు వారాల పాటు దాన్ని తల్లి, శిశువులు చేతికి ఉంచుకోవచ్ఛు

* కాన్పు అయిన వెంటనే తల్లి, శిశువు వివరాలను కంప్యూటరీకరణ చేసి వారిద్దరిని స్కాన్‌ చేస్తారు.

* ఆర్‌ఎఫ్‌ఐడీ పూర్తిగా కంప్యూటరైజ్డ్‌ విధానం. తల్లీబిడ్డల పోలికలు ట్యాగ్‌కు అనుసంధానమవుతాయి. దీనివల్ల శిశువుల తారుమారుకు ఆస్కారం ఉండదు.

* ఏపీ మెడికల్‌ బోర్డు అఫ్రూవల్‌ పొందిన ట్యాగ్‌ ఇది. దీన్ని చేతికి ధరించడం వల్ల తల్లి, బిడ్డలకు ఎలాంటి అపాయం లేదని సిఫార్సు చేశారు.

విధానం అమలు కావట్లేదు

గతంలో ట్యాగ్‌ విధానం ఉండేది. అది కొవిడ్‌కు ముందు తీసేశారు. ఎందువల్ల పనిచేయడం లేదో తెలుసుకుని తిరిగి దాన్ని పునరుద్ధరించటానికి చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రిలో నిఘా కెమెరాలు, భద్రత వ్యవస్థను బలోపేతం చేసుకుని శిశువుల అపహరణకు తావు లేకుండా ఇక మీదట పకడ్బందీగా రక్షణ చర్యలు చేపడతాం.

- ఆచార్య నీలం ప్రభావతి, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని