అడహక్‌ పదోన్నతులకు రాంరాం..!
eenadu telugu news
Published : 18/10/2021 04:56 IST

అడహక్‌ పదోన్నతులకు రాంరాం..!

జిల్లా విద్యా శాఖలో విచిత్ర పరిస్థితి

అన్ని ఖాళీలూ చూపాలంటున్న ఉపాధ్యాయులు

ఈనాడు, అమరావతి

పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, హెచ్‌ఎంలుగా తాత్కాలిక పదోన్నతులు ఇవ్వడానికి సీనియారిటీ జాబితా సిద్ధమైంది. వాటికి అర్హుల నుంచి స్పందన కొరవడింది. ఇవి పూర్తిగా తాత్కాలిక పదోన్నతులు(అడహక్‌) కావడంతో వాటిని తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. ఉద్యోగుల సాధారణ బదిలీల్లో భాగంగా ఎప్పుడైనా టీచర్లకు కౌన్సెలింగ్‌ బదిలీలు నిర్వహిస్తే అప్పుడు వీరంతా కచ్చితంగా కౌన్సెలింగ్‌కు హాజరై ఆ ఖాళీలను మాత్రమే కోరుకుని నూతన పాఠశాలల్లో చేరాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనతో ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. పదోన్నతుల కోసం ఆశపడి ప్రస్తుతం కొనసాగుతున్న మంచి స్కూల్‌ (ప్లేస్‌) వదిలేసుకుని వేరే చోటకు వెళ్లడం సరికాదని కొందరు భావిస్తున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. మరికొందరేమో ప్రస్తుతం చూపిన ఖాళీలు చాలా సుదూరంగా ఉన్నాయని, అందువల్ల పదోన్నతి వదులుకోవటానికే ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయా క్యాడర్లలో కలిపి సుమారు 500 మందికి పదోన్నతులు ఇవ్వటానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఖాళీలను నోటిఫై చేసి విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. వాటిపై ఈనెల 19 వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయొచ్చని విద్యాశాఖ కోరింది. కౌన్సెలింగ్‌ బదిలీలు నిర్వహిస్తే ఎక్కడ కోరుకుంటే ఆ పాఠశాలకే వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉండడంతో ఈ తాత్కాలిక పదోన్నతుల కోసం చాలామంది వెనకంజ వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా పదోన్నతి నిర్ధారిస్తే రెండు ప్యానలియర్ల వరకు అతను పదోన్నతి కోరుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత తిరిగి అవకాశమివ్వరు. ఈ పదోన్నతుల ప్రక్రియ ఏటా పక్కాగా నిర్వహించకపోవడంతో పదోన్నతులు తీసుకునేవారి జాబితా ఈసారి పెద్దసంఖ్యలో ఉంది. మరోవైపు ఆశించిన స్థాయిలో ఖాళీలు లేకపోవటం వంటి వాటితోనూ చాలా మంది ప్రస్తుతం పదోన్నతులు తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఈ తాత్కాలిక పదోన్నతుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు ముందుకు రాకపోవటాన్ని కొందరు సంఘాలనేతలు తప్పుబడుతున్నారు. పదోన్నతి వద్దనుకుంటే రెండు ఇంక్రిమెంట్లు పోతాయని హెచ్చరిస్తున్నారు. మొత్తం ఖాళీలను చూపించాలనే డిమాండ్‌ మరోవైపు నుంచి వ్యక్తమవుతోంది. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం ఇప్పటికే గతంలో బ్లాక్‌ చేసినవి, మిగులు ఖాళీలను చూపించబోమని, 2020 అక్టోబరు 1 తర్వాత ఏర్పడిన ఖాళీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఇక మీదట ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని తుది సీనియారిటీ జాబితాను ఈనెల 23న ప్రదర్శిస్తామని జిల్లా విద్యాశాఖవర్గాలు స్పష్టం చేశాయి. గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు ఈనెల 25న, స్కూల్‌ అసిస్టెంట్స్‌ తత్సమాన క్యాడర్‌ పదోన్నతుల కౌన్సెలింగ్‌ 29, 30 తేదీల్లో నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ షెడ్యూల్‌ జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని