గతమెంతో ఘనం.. నేడు దయనీయం!
eenadu telugu news
Published : 18/10/2021 05:02 IST

గతమెంతో ఘనం.. నేడు దయనీయం!

దుగ్గిరాల యార్డు దుస్థితి ఇదీ..


దుగ్గిరాల యార్డులో పనిచేస్తున్న హమాలీలు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: దుగ్గిరాల మార్కెట్‌ యార్డు క్రమంగా రూపు కోల్పోతుంది. ఒకప్పుడు పాలకుండలా ఆర్థిక పరిపుష్టితో ఉన్న యార్డులో నేడు ఓటి మోతలు మోగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు రానున్న రోజుల్లో మారకుంటే భవిష్యత్తులో జీతాలు ఇవ్వలేని దుస్థితికి యార్డు చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒకప్పుడు దుగ్గిరాలలో యార్డు ఉండేది అని చెప్పుకునే పరిస్థితికి చేరుకుంటుందేమో అనే ఆందోళన రైతుల్లో నెలకొంది.

ఒకప్పుడు రూ.కోట్లు వచ్చేవి..

పసుపు వ్యాపారం రీత్యా దుగ్గిరాల యార్డుకు మంచి పేరుంది. జిల్లాలోనే కాకుండా కృష్ణా, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల నుంచి కూడా సరకును విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చేవారు. ఒకప్పుడు షెడ్లు సరిపోక బస్తాల్లో ఉన్న సరకును అమ్మకానికి పోసేటప్పుడు బయటపోయాల్సి వచ్చేది. రెండేళ్ల క్రితం వరకూ యార్డు ఆదాయం రూ.3.5 కోట్లకు తక్కువ ఉండేది కాదు. ఛైర్మన్‌, పాలకవర్గ పదవులకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. ఒక దశలో యార్డు ఆదాయం రూ.4 కోట్లకు కూడా చేరింది. నేడు ఆ పరిస్థితి లేదు. పట్టుమని రూ.18 లక్షలు కూడా యార్డులో నిల్వలు లేవు. నెలనెలా జీతాల కింద రూ.11 లక్షలు సరిపోతున్నాయి. వీటికి తోడు విద్యుత్తు బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు వస్తున్న ఆదాయంతో పోలిస్తే ఖర్చుకు, నిల్వకు స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంటోంది.

ఆదాయం కోల్పోవడానికి కారణాలు ఇవే..

కర్ణుడి మృతికి సవాలక్ష కారణాలు అన్న చందాన యార్డు ఆదారం కోల్పోడానికి అనేక కారణాలు ఉన్నాయి. సుమారు మూడున్నరేళ్ల కిందట కేంద్రం ప్రవేశపెట్టిన ఈనాం విధానంతో మార్కెట్‌ కళ తప్పడానికి తొలి అడుగు పడింది. దుగ్గిరాలలో యార్డు మొదలయ్యాక దాదాపు ఐదు దశాబ్దాలుగా రైతుల సమక్షంలో ప్రత్యక్షవేలం జరిగే విధానం పోయి వ్యాపారులు ఆన్‌లైన్‌లో బిడ్‌ వేయడం ప్రారంభమైంది. ఇది రైతులు, వ్యాపారులకూ ఇద్దరికీ నచ్చని వ్యవహారమైంది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈనాం పెట్టినా ఈ యార్డుకు అంతగా నప్పలేదు. దీనికితోడు రైతు చట్టాల కారణంగా ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్ఛు. కొనుక్కోవచ్ఛు. అనే నిర్ణయాలతో ఇది కొంత యార్డు ఆదాయాన్ని దెబ్బతీసింది. మూలిగేనక్కపై తాటికాయ పడిన చందాన కరోనా ప్రభావం మరింత కుంగదీసింది. దూరప్రాంతాల నుంచి ఇక్కడకు సరకు తెచ్చేవారు కరువయ్యారు. ఆ క్రమంలో దాదాపు నెలన్నరపాటు యార్డులో అసలు క్రయవిక్రయాలు జరగలేదు. ఇదే సమయంలో చెక్‌పోస్టులు మూసేశారు. పర్యవసానంగా పరిస్థితి మరింత దిగజారింది.

ఈ-పర్మిట్‌ దెబ్బతీసింది..

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసింది. వీటికి మార్కెట్‌ ఫీీజు మినహాయింపు వచ్చింది. అన్నింటికీ మించి ఈ-పర్మిట్‌ మరింత దెబ్బతీసింది. యార్డులో రోజుకు జరిగే వ్యాపారం మొత్తం విలువలో ఒకశాతం ఫీీజు ద్వారా ఆదాయం వస్తోంది. అంటే రోజుకు రూ. 50 లక్షల వ్యాపారం జరిగితే యార్డుకు రూ. 50 వేలు ఆదాయం వచ్చేది. జిల్లాలో ఎక్కడ సరకు కొనుగోలు చేసినా మార్కెట్‌ ఫీీజు యార్డుకే వస్తుంది. ప్రస్తుతం ఈ-పర్మిట్‌లో వ్యాపారి ఎక్కడ సరకు కొనుగోలు చేస్తే మార్కెట్‌ ఫీీజు ఆ పరిధిలోని యార్డుకు వెళ్తుంది. ఉదా: వ్యాపారులు క్రోసూరులో సరకు కొనుగోలు చేసి దాన్ని దుగ్గిరాల తీసుకొచ్చి అమ్ముకున్నా దానిపై మార్కెట్‌ ఫీీజు క్రోసూరు యార్డుకే వెళుతుంది. గతంలో యార్డు పరిధిలో కొల్లిపర మండలం ఉండేది. నేడు ఒక్క దుగ్గిరాల మండలం మాత్రమే ఉంది. ఈ మండలంలో 300 నుంచి 400 ఎకరాల్లో మాత్రమే పసుపు ఉంది. అక్కడ పండే పంట నుంచి మాత్రమే యార్డుకు ఆదాయం వస్తోంది. క్రమంగా సాగు విసీ్తీర్ణం తగ్గడం, ధర అంతగా లేకపోవడం వంటి ఇబ్బందులు మార్కెట్‌పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ఉన్నతాధికారులకు నివేదించాం.. : - ఎన్‌.శ్రీనివాసరావు, కార్యదర్శి, మార్కెట్‌యార్డు

యార్డుకు ఆదాయం తగ్గుతున్న విషయమై ఉన్నతాధికారులకు తెలియజేశాం. మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.30 లక్షలకు పైగా ఆదాయం కోత పడిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని