సనాతన హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యం
eenadu telugu news
Published : 18/10/2021 05:02 IST

సనాతన హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యం

శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి


విశ్వధర్మ పరిరక్షణ వేదిక కార్యవర్గం, వాసవి పరివార్‌ అంతర్జాతీయ క్రియాశీల సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న పీఠాధిపతులు

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: సనాతన భారత హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ గో సంరక్షణకు కృషి చేయాలని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి పేర్కొన్నారు. గుంటూరు ఆటోనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి పరివార్‌ అంతర్జాతీయ తెలంగాణ క్రియాశీలక సభ్యులు, గుంటూరు పరివార్‌ అర్బన్‌ కమిటీ, వాసవి పరివార్‌ మహిళా విభాగం, ధర్మో రక్షతి రక్షితః, వనితా శక్తి విభాగాల కమిటీలకు ఎంపికైన కొత్త కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. వాసవి పరివార్‌ అంతర్జాతీయ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వేముల హజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించగా శివస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో దళిత వాడలను ఉద్ధరిస్తూ 72 గ్రామాల్లో 7 వేల గోవులను వధించకుండా సంరక్షించామని వెల్లడించారు. పలుచోట్ల కూలగొట్టిన దేవాలయాల పునర్నిర్మాణానికి కృషి చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ధర్మమార్గాన్ని అనుసరిస్తే సమాజం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సభాధ్యక్షుడు హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయ విలువలు కోల్పోతున్న తరుణంలో ధర్మ పరివారాన్ని, సేవా పరివారాన్ని సంఘటితం చేసేలా ధార్మిక కమిటీలు పాటుపడుతున్నట్లు వెల్లడించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌, వ్యాపారవేత్త జీవీఎల్‌ కాంతారావులు మాట్లాడారు. విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణమాచార్య స్వామి, ప్రధాన కార్యదర్శిగా భవాని శంకరానందస్వామి, కోశాధికారిగా అతికేశ్వరనంద స్వామిలు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వాసవి పరివార్‌ అంతర్జాతీయ కమిటీలోని పలు విభాగాలకు నియమితులైన క్రియాశీలక సభ్యులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో పీఠాధిపతులు జ్ఞానేశ్వరానంద స్వామి, రామాయణ మహేష్‌స్వామిలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వాసవి పరివార్‌ అంతర్జాతీయ కమిటీ ప్రతినిధులు జి.రవీంద్రకుమార్‌, గ్రంధి హనుమంతరావు, రఘురాం, అమరా బాలా తదితరులు పర్యవేక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని