సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం
eenadu telugu news
Published : 18/10/2021 05:02 IST

సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం


మాట్లాడుతున్న పాండురంగవరప్రసాదరావు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలు, పెండింగ్‌ డీఏల విడుదల కోసం ఉద్యమం తప్ప మరో మార్గం లేదని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు పేర్కొన్నారు. ఆదివారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది. ఈసందర్భంగా పాండురంగవరప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ వేసి నాలుగు సంవత్సరాలవుతున్నా అమలు కాక ఎంతో మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ చెందుతూ ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. పెండింగ్‌ డీఏలు ఎప్పుడు ఇస్తారో తెలియక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అనవసర యాప్‌లతో రోజూ విలువైన బోధనా సమయం పోతుందన్నారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎన్ని సార్లు అధికారులకు వినతులు చేసినా ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు విజయవాడలో ఏపీటీఎఫ్‌ నిర్వహించే రాష్ట్ర స్థాయి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే నవంబరు 2న వేలాది మంది ఉపాధ్యాయులతో చలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు కె.బసవలింగారావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన వారికి సంవత్సరం దాటినా వారి పెన్షన్‌, గ్రాట్యుటీ, దాచుకున్న పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐసీ సొమ్ము అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ చాంద్‌బాషా, జిల్లా ఉపాధ్యక్షులు నాగశివన్నారాయణ, బి.మల్లీశ్వరి, కార్యదర్శి మక్కెన శ్రీనివాస్‌, ఖాలీద్‌, బొర్రా శ్రీనివాసరావు, రాంబాబు, లక్ష్మణ్‌, బాలకృష్ణ, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని