కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రభుత్వాల పెద్దపీట
eenadu telugu news
Published : 18/10/2021 05:02 IST

కార్పొరేట్ల ప్రయోజనాలకే ప్రభుత్వాల పెద్దపీట


సభలో మాట్లాడుతున్న ఆచార్య జగ్‌మోహన్‌ సింగ్‌

లాడ్జిసెంటర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే : దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రత్యామ్నాయ ప్రజా పోరాటాలుగా చూడాలని పంజాబ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌, అఖిలభారత విద్యాహక్కు సమాఖ్య ఛైర్మన్‌ ఆచార్య జగ్‌మోహన్‌ సింగ్‌ అన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ శేషయ్య మొదటి సంస్మరణ సభ గుంటూరులోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘వ్యవసాయం- కార్పొరేటీకరణ -రైతుల ఉద్యమం’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ప్రొఫెసర్‌ జగ్‌మోహన్‌సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సాధారణ రైతులు రోడ్డున పడి ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వారి పైకి వాహనాలు నడిపి దారుణంగా హతమార్చడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు. భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా జీవితకాలం పోరాడిన అమరుడు ప్రొఫెసర్‌ శేషయ్య అని జగ్‌మోహన్‌సింగ్‌ కొనియాడారు. ఆయన ఆశయాలు కొనసాగించడమే శేషయ్యకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేష్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ విద్యను కాషాయీకరణ చేసేందుకు స్పష్టమైన లక్ష్యంతో కేంద్రం ముందుకు వెళుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నాయని విమర్శించారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలకా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ సంఘటిత, చైతన్య ఉద్యమాలతోనే ప్రజా వ్యతిరేక చట్టాలను తిప్పి గొట్టగలమన్నారు. పౌరహక్కుల సంఘం ప్రచురించిన ‘పౌర హక్కుల ఉద్యమ ధ్రువతార’, ‘రాజ్యాంగం-పౌర హక్కులు’ పుస్తకాలను దివంగత ప్రొఫెసర్‌ శేషయ్య సహచరి ఆర్‌.శశికళ, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్యలు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎం.శ్రీమన్నారాయణ, ఆంజనేయులు, నారాయణ, వెంకటేశ్వర్లు, దుడ్డు ప్రభాకర్‌, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని