అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
eenadu telugu news
Published : 19/10/2021 04:06 IST

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు 

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఒకే ఒక్కడు 300 పైగా చోరీలు చేశాడు. నేరాలు చేయడం..పోలీసులు పట్టుకోవడం..జైలుకు వెళ్లడం తిరిగి వచ్చి మళ్లీ అదే పని చేయడం అతనికి పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులకు సవాల్‌గా మారిన అంతర్రాష్ట్ర దొంగను గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.30 లక్షల విలువైన 688 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ విలేకరులకు తెలిపారు. తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన జొన్న దినేష్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఈ నెల రెండో తేదీన ఇంటికి తాళం వేసి గుంటూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి రాగా బీరువాలోని 688 గ్రాముల బంగారు వస్తువులు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి సీఐ శేషగిరిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలో లభించిన ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానంతో విచారిస్తే పాత నేరస్థుల పనిగా తేలింది. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన కొర్రపాటి నాగరాజు, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట ఆత్మకూరు, మోతె మండలాలకు చెందిన గుంజా వెంకన్న, పాలుకూరి నారాయణ, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం బొడ్డువారిపాలెంకు చెందిన బాలినేని కృష్ణారెడ్డి ఈ చోరీకి పాల్పడ్డారు. కొర్రపాటి వీరనాగరాజుపై తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రకాశం, విజయవాడలో 300కు పైగా కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈసారి అతనిపై ప్రత్యేక సెక్షన్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. అతనితో పాటు అదే ముఠాలోని మిగిలిన సభ్యులపై తెలంగాణ, ప్రకాశం జిల్లా, తాడేపల్లిలో చోరీ కేసులు ఉన్నాయన్నారు. నిందితులు ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద సంచరిస్తున్నారనే సమాచారంతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద రూ.30 లక్షల విలువ చేసే 688 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ రాంబాబు, సీఐ శేషగిరిరావు, సిబ్బందిని అభినందించి వారికి రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ గంగాధరం తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని