పంచలోహ విగ్రహాల విక్రయానికి యత్నం
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

పంచలోహ విగ్రహాల విక్రయానికి యత్నం

ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు

విగ్రహాలను పరిశీలిస్తున్న అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, ఏఎస్పీ గంగాధరం, డీఎస్పీ సుప్రజ

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పొలం దున్నుతుంటే 200 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని విక్రయించడానికి యత్నించిన ఆరుగురు సభ్యుల ముఠాను గుంటూరు అరండల్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ విలేకరులకు తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపల్లెకు చెందిన వంగెపురం సుందరరావు పొలంలో 2020, నవంబరులో ట్రాక్టర్‌తో మట్టిని చదును చేయిస్తుండగా ఒక మూట బయటపడింది. అందులో దేవతామూర్తుల పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. బంగారపు విగ్రహాలు అనుకుని ఇంట్లో దాచిపెట్టాడు. అతను రోడ్డు ప్రమాదం బారిన పడటంతో చికిత్సకు డబ్బులు అవసరమయ్యాయి. నెల రోజుల కిందట అన్న కుమారుడు రవిని పిలిచి పొలంలో దొరికిన విగ్రహాల గురించి తెలిపి వాటిని విక్రయించాలని కోరాడు. అతని బంధువులు జనరాజుపల్లి చిట్టిబాబు, రావూరి నవీన్‌, రావూరి వెంకటరావు, బెజవాడ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి వాటిని గుంటూరు కొరిటెపాడులోని తాకట్టు వ్యాపారి కొండముది శ్యాంకు విక్రయించడానికి యత్నించారు. విగ్రహాలను సంచిలో పెట్టుకొని వస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న పశ్చిమ డీఎస్పీ సుప్రజ, అరండల్‌పేట సీఐ నరేష్‌, ఎస్సై రవీంద్ర సిబ్బందితో కలిసి వారిని అరెస్టు చేశారని ఎస్పీ చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో ఆ విగ్రహాలు 200 సంవత్సరాల నాటివని తేలిందన్నారు. వాటిని పురావస్తు శాఖకు అందజేస్తామన్నారు. ఏఎస్పీ గంగాధరం, డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని