కట్టుకున్నోడే కడతేర్చాడు!
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

కట్టుకున్నోడే కడతేర్చాడు!

ఆపై స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నం

మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి లక్ష్మి

పొన్నూరు, చినగంజాం, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి ప్రణాళిక ప్రకారం తన భార్యను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం సొంత ఊరు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం ఉదయం వెలుగు చూసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చినగంజాం ఎస్సై పి.అంకమ్మరావు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లకు చెందిన మామిళ్లపల్లి శ్రీనివాసరావుకు.. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన మాధవి (30)తో పధ్నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. వివిధ కారణాలతో తరచూ దంపతులిద్దరూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలోనే గతేడాది కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. శ్రీనివాసరావు... పిల్లలతో కలిసి అప్పికట్లలో ఉండగా; మాధవి... బ్యూటీపార్లర్‌ నిర్వహిస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. నెల రోజుల కిందట ఇద్దరూ మాట్లాడుకుని... అప్పికట్లలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై ఆమె పుట్టింటికి బయలుదేరారు. మార్గం మధ్యలో పర్చూరు, కారంచేడు ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లి... సాయంత్రం వరకు అక్కడే గడిపారు. రాత్రి పొద్దుపోయాక తిమ్మసముద్రం బయలుదేరారు. శ్రీనివాసరావు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం... వేటపాలెం - సంతరావూరు గ్రామాల మధ్య ఆలేరు కాలువ కట్టపైకి మాధవిని తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో అటుగా వెళ్లిన కొందరు స్థానికులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల డీఎస్పీ శ్రీకాంత్‌, ఇంకొల్లు సీఐ సుబ్బారావు, చినగంజాం ఎస్సై అంకమ్మరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆమె ఎవరన్నది కొంతసేపు తెలియరాలేదు. తిమ్మసముద్రం గ్రామానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోనే ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. మాధవి తల్లి లక్ష్మి అనుమానం కొద్దీ ఘటనా స్థలానికి చేరుకుని కుమార్తెను గుర్తించి కన్నీటిపర్యంతమయ్యారు. ఇక తన మనుమరాళ్లకు దిక్కెవరంటూ విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యను హత్య చేసిన శ్రీనివాసరావు... ఆ తర్వాత స్వగ్రామానికి చేరుకుని పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గుర్తించి అతడిని పొన్నూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. చినగంజాం పోలీసులు వచ్చి నిందితుడి వాంగ్మూలం నమోదు చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

పొన్నూరులో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని