విద్యుత్తు మీటర్ల కేవైసీ నమోదు
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

విద్యుత్తు మీటర్ల కేవైసీ నమోదు

వెనిగండ్లలో సంతకం చేస్తున్న వినియోగదారుడు శ్రీనివాసరావు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో గృహ విద్యుత్తు వినియోగదారుల సమాచారాన్ని సీపీడీసీఎల్‌ సేకరిస్తోంది. తన పరిధిలో ఉన్న మీటర్ల వారీగా ఎంత మంది వినియోగదారులు ఉన్నారు? ప్రస్తుతం ఆ సర్వీసు నంబరు ఉన్న ఇంట్లో మీటరుదారులు ఉంటున్నారా? అద్దెకు నివాసం ఉంటున్న వారు వాడుకుంటున్నారా? అనే సమాచారంతో పాటు ఆధార్‌ అనుసంధానం చేశారా? లేదా? అనే వివరాలతో కేవైసీ నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు సచివాలయాల విద్యుత్తు సహాయకుల మొబైల్‌ ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాయి. దాంతో వారి చిట్టా మొత్తం కనిపిస్తోంది. బహుళ అంతస్తుల సముదాయం (అపార్ట్‌మెంట్‌)లో 10 నుంచి 20 ఫ్లాట్లను నిర్మించినపుడు నిర్మాణ సంస్థ పేరుతో విద్యుత్తు కనెక్షన్లు తీసుకున్నారు. ప్లాట్లను కొనుగోలు చేసిన వారిలో తక్కువ మంది మాత్రమే వారి పేరుతో మీటర్లను మార్చుకున్నారు. ఆయా బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసిన యజమానులే ఉంటున్నారా? లేదా? అనే వివరాలు నమోదు చేస్తున్నారు. యజమానులు ఉంటే విద్యుత్తు వినియోగదారుడు, మీటరుదారుడు వద్ద రెండు సంతకాలు చేయించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, నవరత్నాలను అమలు చేసేందుకు విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల లోపు వారికి వర్తింపజేస్తున్నారు. 300 యూనిట్లు పైన వాడిన వారికి రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవైసీ పేరుతో సీపీడీసీఎల్‌ విద్యుత్తు వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రామాల్లో రెండు గృహాలు ఉన్న వారు ఒక ఇంటిని అద్దెకు ఇచ్చి మరో ఇంటిలో వారుంటున్నారు. అద్దెకు ఉన్న వాళ్లు నెలకు 300 పైన యూనిట్లు వినియోగిస్తే అది ఇంటి యజమాని మీటరులో నమోదు చేస్తారు. దీని వల్ల సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఎయిర్‌ కండీషన్‌ (ఏసీ) ఉన్న వారికి గృహాలను అద్దెకు ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. సీపీడీసీఎల్‌ అధికారులు మాత్రం విద్యుత్తు వినియోగదారుల వివరాల కోసమే కేవైసీ చేస్తున్నామని, సంక్షేమ పథకాలకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని