నిశ్శబ్దం ఛేదించొచ్చు
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

నిశ్శబ్దం ఛేదించొచ్చు

వినికిడి లోపం అధిగమించేందుకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు

గుంటూరు సర్వ జనాసుపత్రిలో 23 నుంచి ప్రారంభం

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రోస్కోపు

పసిబిడ్డల్లో వినికిడి లోపం తలెత్తితే జీవితం నిశ్శబ్దం, నిస్సారం అయిపోతుంది. పసిపిల్లల్లోనైతే ఇది మరీ పెద్ద సమస్య. వినికిడి లేకపోతే, వాళ్లకు మాటలు కూడా రావు. చివరికి వాళ్లు ‘మూగ-చెవిటి’గా మిగిలిపోతారు. అందుకే పిల్లల్లో వినికిడి శక్తికి ఎంతో ప్రాధాన్యం. వినికిడి లోపం అధిగమించేందుకు నేడు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క సమర్థ విధానం కాక్లియర్‌ ఇంప్లాంట్‌. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చి ఎంతోమంది పసిబిడ్డలను చెవిటి-మూగ అవస్థల నుంచి బయటపడేస్తున్న అద్భుత పరిజ్ఞానం ఇది. దీన్ని గుంటూరు సర్వజనాసుపత్రిలో తొలిసారి ఈ నెల 23వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నారు.

సాహి ట్రస్టు చేయూత
హైదరాబాద్‌కు చెందిన సాహి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ విజయకుమార్‌ అపోలో ఆసుపత్రి సహకారంతో రూ.50 లక్షల విలువైన వైద్య పరికరాలను సర్వజనాసుపత్రి ఈఎన్‌టీ విభాగానికి అందజేశారు. మొదటిసారి నిర్వహిస్తున్న కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలకు అవసరమైన వైద్యుల బృందాన్ని ఆయన పంపుతున్నారు. దీంతో సర్జరీలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది.

జీజీహెచ్‌లో నిపుణులైన వైద్యులు
ఆచార్యులు ఎన్‌.సుబ్రహ్మణ్యం, టి.రాజేంద్రప్రసాద్‌, సహాయ ఆచార్యులు పి.వి.సంపత్‌కుమార్‌, సి.అనిత, సి.అరుణకుమార్‌ ఉన్నారు. వీరికి విద్యార్థి వైద్యులు, సాంకేతిక నిపుణులు, నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బంది తోడ్పాటు అందించనున్నారు.

మూడేళ్ల లోపు
తీవ్రమైన వినికిడి లోపం ఉన్న పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ను మూడేళ్ల లోపు అమరిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులైన వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే మాటలకు కారణమయ్యే మెదడులోని భాగాన్ని ఐదేళ్ల వరకూ ప్రేరేపించకపోతే ఆ భాగం ఇతర పనులను చేపడుతుంది. అందువల్ల వీరికి మాటలు స్పష్టంగా రావు. కాబట్టి వినికిడి లోపాన్ని త్వరగా గుర్తించడం.. లోపం తీవ్రంగా, అతి తీవ్రంగా ఉంటే ఇంప్లాంట్‌ను అమర్చడం ఎంతో అవసరమని వైద్యులు తెలుపుతున్నారు. తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన బిడ్డలకు ఏడాది లోపే ఈ సర్జరీ చేసి ఇంప్లాంట్‌ అమర్చడం ఉత్తమమన్నారు. మూడేళ్ల లోపు అమర్చిన బిడ్డలతో పోలిస్తే ఏడాది లోపే అమర్చిన వారికి మాటలు వచ్చే ప్రక్రియ మెరుగ్గా ఉంటున్నట్లు గుర్తించామన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా సర్జరీలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అంతేగాకుండా రెండు చెవులకూ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చేందుకు రూ.12 లక్షలు ఇస్తున్నారు. రెండు చెవులకూ అమరిస్తే ఫలితాలు మరింత బాగుంటాయన్నారు.

పిల్లలకు ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలోనూ ఈ శస్త్రచికిత్సలు చేసే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో లేదు. గతంలో విశాఖపట్టణం కింగ్‌జార్జి ఆసుపత్రిలో చేసినప్పటికీ కొన్నేళ్ల నుంచి అక్కడా నిలిపివేశారు. జీజీహెచ్‌లో నూతనంగా ఈ తరహా శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు ఇక్కడి వైద్యులు ఆసక్తి కనబర్చడంతో తొలుత ఇక్కడ ప్రారంభిస్తున్నారు. దీనివల్ల వినికిడి లోపం ఉన్న పిల్లలకు ఎంతో మేలు జరగనుందని వైద్యులు తెలుపుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ చికిత్స అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తుందని వివరిస్తున్నారు. ఈ ఆపరేషన్లు ప్రారంభమైతే రోగులకు మేలు జరగడమే గాకుండా బోధనాసుపత్రి అయినందున శిక్షణలో ఉండే విద్యార్థి వైద్యులకు ఎంతో ప్రయోజనకరమని వివరించారు. నవ్యాంధ్రలో ఎక్కువ మంది నిపుణులను తయారు చేయవచ్చని తెలుపుతున్నారు.

అందుబాటులో శస్త్రచికిత్స మందిరం
మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్‌ఫెక్షన్‌ శాతం చాలా తక్కువ. ఈ శస్త్రచికిత్స మందిరంలోనే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేయనున్నారు. ఈ సర్జరీతో సాధారణంగా ఎలాంటి సమస్యలూ ఉండవు. ఒకటి రెండు రోజుల్లోనే ఇంటికి పంపేస్తారు. గాయం మానిన తర్వాత అప్పుడు బయటి యూనిట్‌ను అనుసంధానిస్తారు.

మాట్లాడే ప్రక్రియపై శిక్షణ
సర్జరీ తర్వాత మూడు వారాలకు చర్మం పైనుంచి స్పీచ్‌ ప్రాసెసర్‌ను అనుసంధానించి, కంప్యూటర్‌ సహాయంతో వివిధ శబ్ద స్థాయులను శ్రుతి చేస్తారు. దీన్ని మ్యాపింగ్‌ అంటారు. ఇందులో శబ్దాల తీవ్రత మరీ అధికంగా గానీ తక్కువగా గానీ లేకుండా.. క్రమేపీ వినికిడి అలవాటు పడేలా, సామర్థ్యం మెరుగయ్యేలా చేస్తారు. నిజానికి ఇంప్లాంట్‌ సాయంతో మనం వినికిడిని పునరుద్ధరించవచ్చు గానీ, మాట్లాడే ప్రక్రియను మాత్రం ప్రత్యేకంగా నేర్పించాల్సిందే. దీన్నే ఆడిటరీ వెర్బల్‌ థెరపీ అంటారు. ఇప్పటికే మాట్లాడటం వచ్చిన వారికి 2-3 నెలలు శిక్షణ సరిపోతుంది. ఇంకా మాటలు రాని పిల్లలకు 2-3 ఏళ్ల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. వినికిడి మాటలను గ్రహించి, తిరిగి మాట్లాడేలా చెయ్యడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యం. దీనికోసం ఆడిటరీ వెర్బల్‌ థెరపిస్టులు కృషి చేస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని