ఉప్పునకు కల్తీకాటు!
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

ఉప్పునకు కల్తీకాటు!

అయోడిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ గ్రంథిపై ప్రభావం
ఈనాడు, అమరావతి

గుంటూరు నగరంలో ఓ వ్యాపార సంస్థలో సీˆజ్‌ చేసిన నాన్‌ అయోడిన్‌ ఉప్పు బస్తాలు

ల్తీకి కాదేది అనర్హం అనేలా పరిస్థితి ఉంది. చివరకు ఉప్పును కల్తీమయం చేస్తున్నారు. ఇటీవల గుంటూరు నగరంలో ఓ వ్యాపారి నాన్‌ అయోడిన్‌ ఉప్పును కిలో, అరకిలోలుగా ప్యాకింగ్‌ చేశారు. దానినే అయోడిన్‌ ఉప్పుగా విక్రయించడానికి సిద్ధమవుతుండగా ఆ విషయం తెలుసుకుని జిల్లా ఆహార కల్తీ నియంత్రణ విభాగం దాడులు చేశారు. ఆ నిల్వలు మొత్తాన్ని సీˆజ్‌ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. మానవ వినియోగానికి అయోడిన్‌ ఉప్పునే వాడాలని ఒకవైపు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. దీని ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ చైతన్య పరుస్తోంది. మరోవైపు కొందరు ఉప్పును కల్తీ చేస్తున్నారు. ఇప్పటికే సదరు వ్యాపారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఆర్‌ బ్రాండ్‌ పేరుతో ఇది ఆ వ్యాపారి నుంచి తరలుతోందని అధికారులు చెప్పారు. దీన్ని పశువుల దాణా కోసం, కొన్ని మందుల తయారీలోనే వినియోగించాలని, మానవ వినియోగానికి సరికాదని వైద్యులు హెచ్చరించారు. ఏఎస్‌ఆర్‌ బ్రాండ్‌ పేరుతో సరఫరా అవుతున్నది నాన్‌ అయోడిన్‌ ఉప్పు అని దాన్ని మానవ వినియోగానికి వాడకూడదని జిల్లా ఆహార కల్తీ నియంత్రణ విభాగం సహాయ తనిఖీ అధికారి గౌస్‌ మొహియిద్దీన్‌ తెలిపారు. ‘21న వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో ఈ ఉప్పు మానవ వినియోగానికి విక్రియంచకూడదని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించనున్నట్లు’ తెలిపారు. ఈ వ్యవహారంపై జేసీకి నివేదించామని, ఆయన ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు త్వరలో తీసుకుంటామన్నారు. 

ఉప్పు ద్వారానే అయోడిన్‌..
మనుషులకు అయోడిన్‌ అనేది ఉప్పు రూపంలోనే లభిస్తుంది. ఇది లోపిస్తే థైరాయిడ్‌ గ్రంథి సరిగా పని చేయదు. మనిషి పుట్టుక నుంచి చనిపోయే దాకా అది బాగా పనిచేస్తేనే యాక్టివ్‌గా ఉంటారు. ఈ దృష్ట్యా థైరాయిడ్‌ గ్రంథి బాగుండడానికి అయోడిన్‌ లోపం లేకుండా చూసుకోవాలి. అది లోపిస్తే పిల్లల్లో బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది. పెద్దవాళ్లకు హైపో థైరాయిడ్‌ వస్తుంది. చాలా మంది థైరాయిడ్‌ సమస్యతో బాధపడడానికి కారణం అయోడిన్‌ లోపించడమేనని వైద్యులు అంటున్నారు. మొత్తంగా అయోడిన్‌ లోపంతో మానవాళిని అనేక జబ్బులు కబళిస్తాయి. ప్రధానంగా మనిషి ఎదుగుదల ఆగిపోతుంది. ప్రధానంగా గర్భణిగా ఉన్నపుడు ఇది లోపిస్తే పుట్టేబిడ్డకు బుద్ధిమాంద్యం వస్తుంది. శిశువు ఎదుగుదల ఉండదు. పొట్టిగా ఉంటారు. వీటన్నింటిని రెటినిజం అంటారు. అందుకే ఆహారంలో అయోడిన్‌ లోపం లేకుండా చూసుకోవడానికి కచ్చితంగా అయోడిన్‌ ఉప్పు వాడకాన్ని విస్మరించకూడదు. ఆహారం పండించే నేలల్లో ఇది లోపించడం వల్లే బయటి నుంచి అయోడిన్‌ తీసుకోవాల్సి వస్తోందని వైద్యవర్గాలు అంటున్నాయి. సముద్రపు రొయ్యలు, చేపలు, పీతలు వంటివి తీసుకునేవారికి అయోడిన్‌ లోపం ఉండదు.


ఇలా గుర్తించొచ్చు..

తీసుకునే ఉప్పు అయోడినా? కాదా అనేది తెలుసుకోవాలంటే ఒక గ్రాము ఉప్పును తీసుకుని దానిలో మిథిలిన్‌ అనే సొల్యూషన్‌ వేస్తే అది నీలం రంగులోకి మారాలి. ఈ రంగులోకి మారితే అది అయోడిన్‌ ఉప్పుగా భావించొచ్చని వైద్యులు తెలిపారు.


అనేక సమస్యలు వస్తాయి

యోడిన్‌ లోపిస్తే అది హైపో థైరాయిడ్‌ వ్యాధికి దారి తీస్తుంది. ప్రస్తుతం ఇది లోపించి అనేక మంది థైరాయిడ్‌ బారిన పడుతున్నారు. అయోడిన్‌ లోపం ఎలా తెలుస్తుందంటే విపరీతంగా బరువు పెరుగుతారు. బద్ధకం వస్తుంది. జుట్టు రాలిపోవడం, నిద్ర పట్టకపోవడం, చర్మ పొడిబారటం, నెలసరి సరిగా రాకపోవడం వంటివి దీనికి లక్షణాలు. ఇవి ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి సలహాతో నాలుగైదు నెలలు మందులు వాడితే ఈ సమస్యను అధిగమించొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇప్పటికీ కళ్ల ఉప్పునే వాడతారు. దానిలో అయోడిన్‌ కలిపితే ఫర్వాలేదు. అది లేకుండా నేరుగా తీసుకుంటే కచ్చితంగా అయోడిన్‌ లోపిస్తుంది.  

-ఆచార్య ఆర్‌.నాగేశ్వరరావు, సామాజిక వ్యాధుల విభాగాధిపతి, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని