AP News: ‘కేశినేని నాని పార్టీ మారడం లేదు’
eenadu telugu news
Published : 19/10/2021 07:51 IST

AP News: ‘కేశినేని నాని పార్టీ మారడం లేదు’

భవానీపురం, న్యూస్‌టుడే : విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన సన్నిహితుడు, తెదేపా నాయకుడు ఫతావుల్లా ఖండించారు. నాని తెదేపాని విడిచిపెట్టి భాజపాలో చేరబోతున్నారని, అందుకే తన కార్యాలయం ‘కేశినేని భవన్‌’లోని తెదేపా అధినేత చంద్రబాబు ఫొటోతో పాటు, పార్టీ నాయకుల ఫొటోలన్నీ తొలగించారని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానిపై ఫతావుల్లా సోమవారం కేశినేని భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘కేశినేని భవన్‌లో ఒక చోట మాత్రమే రతన్‌టాటాతో నాని ఉన్న చిత్రపటాన్ని పెట్టారు.  టాటా ట్రస్ట్‌ ద్వారా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రతన్‌టాటా విస్తృతంగా సేవలందించారు. దానికి కృతజ్ఞతగా, ఆ సేవల్ని మరింత విస్తృతం చేయాలన్న ఉద్దేశంతోను ఆ చిత్ర పటాన్ని కార్యాలయంలో ఉంచారు. అంతే తప్ప పార్టీ మారడం కోసం కాదు. అలాంటి ప్రచారం చేస్తున్న వారికి... కార్యాలయం బయట ఉన్న నలభై అడుగుల ఎత్తైన చంద్రబాబు, ఎన్టీఆర్‌ చిత్రాలు కనిపించడం లేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పార్టీ ఇన్‌ఛార్జులుగా ఉన్న నాయకుల ఫొటోలు తొలగించారన్న ప్రచారం కూడా వాస్తవం కాదన్నారు. ‘‘భాజపా మునిగిపోయే పడవ. ఆ పార్టీతో మా నాయకుడు ఎలాంటి చర్చలూ జరపడం లేదు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమనే ఉద్దేశంతోనే ఎంపీ నానీ పని చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఎక్కడా దూరంగా లేరు. ఇటీవల తిరువూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024లో సైకిల్‌ గుర్తుపైనే పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయం సాధిస్తారు’’ అని వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని