డిజిటల్‌ బాటలో పల్లె పాలన
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

డిజిటల్‌ బాటలో పల్లె పాలన

యాప్‌ ద్వారా పన్నుల వసూళ్లకు సన్నాహాలు
న్యూస్‌టుడే, చల్లపల్లి గ్రామీణం

సాంకేతిక విప్లవం పల్లెల్లోనూ విస్తరిస్తోంది. డిజిటల్‌ మొబైల్‌ యాప్‌లు అందుబాటులోకి రావడంతో అత్యధిక మంది జనాభా ఇంటివద్ద నుంచే నచ్చిన సరకులు, ఆహార పదార్థాలు, మందులు, దుస్తులు, గృహోపకరణాలు తదతరాలను బుక్‌ చేసుకొని తెప్పించుకుంటున్నారు. దీంతోపాటు వివిధ రకాల సేవలకు సంబంధించిన బిల్లులన్నింటినీ డిజిటల్‌ విధానంలో చెల్లించేస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఆధునిక సేవలను గ్రామ పంచాయతీలకు వర్తింపజేయాలని ఆ శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గ్రామీణులు సైతం ఇకపై ఇంటిపన్ను, నీటి కుళాయి బిల్లులు, పన్నేతరాలు డిజిటల్‌ యాప్‌ ద్వారా చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

మోపిదేవి పంచాయతీ

* పంచాయతీల ప్రధాన ఆదాయ వనరులైన ఇంటి పన్ను, నీటి కుళాయి ఛార్జీలు, చెరువుల వేలం పాటల్లో సిబ్బంది చేతివాటంతో రూ.లక్షల్లో చేతులు మారేవి. ఇంతవరకూ అమలు చేసిన వసూళ్ల విధానం అక్రమాలకు కేరాఫ్‌గా మారడం, నగదు లావాదేవీలపై అపోహలు ఏర్పడటం, అవి కేసుల వరకు వెళ్తుండడం పరిపాటిగా మారింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ప్రతి అసెస్‌మెంట్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి డిజిటల్‌ పంచాయతీ విధానంలో డిమాండ్‌ నోటీసు ఇస్తారు. యాప్‌ ద్వారా నగదు వసూలు, రశీదులు ఇచ్చే విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వెబ్‌సైట్‌లో ఇప్పటికే దాదాపు 99 శాతం అసెస్‌మెంట్ల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. మొబైల్‌ యాప్‌పై దశల వారీగా శిక్షణ ప్రారంభించారు. ప్రస్తుతం ఇది కొనసాగుతోంది.

* జిల్లాలో 981 పంచాయతీలున్నాయి. వాటిలో గ్రేడ్‌-1లో 218, గ్రేడ్‌-2లో 139, గ్రేడ్‌-3లో 142, గ్రేడ్‌-4లో 11, గ్రేడ్‌-5, 6లలో 471 ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త విధానంలో పన్నులు వసూలు చేయనున్నారు. జిల్లాలో రమారమి రూ.500-550 కోట్ల వరకు ఇంటి పన్నుల వసూళ్లకు లక్ష్యంగా నిర్దారించారు. వాటిలో పాత బకాయిలు కూడా ఉన్నాయి. మచిలీపట్నం డివిజన్‌లో రూ.29 కోట్ల మేర పాత బకాయిలున్నాయి. 2021-22 లక్ష్యం రూ.105 కోట్లు కాగా పాత బకాయిలు కలిపి రూ.134 కోట్లుగా ఉంది. జిల్లాలో 282 పంచాయతీలు మాత్రమే వంద శాతం పన్నుల వసూళ్లు సాధించాయి. కొవిడ్‌ వల్ల ప్రజల ఆర్థిక స్థితిపై ప్రభావం పడటంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి.


సులువైన పద్ధతి

కాగిత రహిత సేవల విధానం ఓ ప్రయోగం కానుంది. పంచాయతీల్లో ఇప్పటికే కొన్ని విభాగాల్లో డిజిటల్‌ పద్ధతిలో సేవలందిస్తున్నాము. పన్ను చెల్లించేవారికి ఇది సులువైన పద్దతి. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు తగిన శిక్షణ ఇస్తున్నారు.

- కె.రామకోటేశ్వరరావు (మెరకనపల్లి పంచాయతీ కార్యదర్శి)


అక్రమాలకు అడ్డుకట్ట

అక్రమాలను అరికట్టడంతోపాటు పారదర్శక సేవలు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుంది. డిజిటల్‌ యాప్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువకానున్నాము. పంచాయతీరాజ్‌ శాఖలో ఇది మరో మైలురాయి కానుంది.

- జ్యోతిర్మయి, మచిలీపట్నం డివిజినల్‌ పంచాయతీ అధికారిణి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని