ఆస్తి కోసం కత్తి వేటు
eenadu telugu news
Updated : 19/10/2021 05:21 IST

ఆస్తి కోసం కత్తి వేటు

మామ మృతి, భార్య, అత్త పరిస్థితి విషమం

భార్య ధనలక్ష్మితో నిందితుడు వీర్ల రాంబాబు (పాతచిత్రం)

మైలవరం, న్యూస్‌టుడే: ఆస్తిని అమ్మనివ్వడంలేదన్న కక్షతో అత్తింటిపై కత్తి దూశాడా అల్లుడు. విచక్షణారహితంగా చేసిన దాడిలో ఆ కుటుంబ పెద్ద ప్రాణాలు విడవగా, భార్య, అత్తల పరిస్థితి విషమంగా మారింది. మారుమూల పల్లెలో కలకలం రేపిన ఈ దారుణ ఘటనపై మైలవరం సీఐ పి.శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మైలవరం మండలం ఎదురుబీడేనికి చెందిన కొలుసు ఏడుకొండలు(42) పెద్ద కుమార్తె ధనలక్ష్మిని గన్నవరం మండలం బల్లిపర్రుకు చెందిన వీర్ల రాంబాబుతో నాలుగేళ్ల కిందట వివాహం జరిపించారు. వారికి ప్రస్తుతం ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎదురుబీడెంలో అత్తింటివారిచ్చిన అరెకరానికి తోడు, అక్కడే మరో అరెకరం భూమిని రాంబాబు ఏడాది కిందట కొనుగోలు చేశాడు. వ్యసనాలకు బానిసైన అతను కొంతకాలంగా ఆ ఎకరం పొలాన్ని అమ్మి డబ్బులు తేవాలని భార్యపై ఒత్తిడి తెస్తున్నాడు. పొలం అమ్మితే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని, అమ్మడానికి వీల్లేదని అత్తమామలు అడ్డు తగులుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం భర్త వేధింపులు తట్టుకోలేక పిల్లల్ని తీసుకుని భార్య పుట్టింటికి వచ్చింది. పగబట్టిన రాంబాబు సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎదురుబీడెం వచ్చి, నిద్రిస్తున్న మామ ఏడుకొండలు తలపై విచక్షణారహితంగా కత్తితో నరకడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయాడు. కత్తి దెబ్బలకు ఏడుకొండలు పడుకున్న మంచంపై నులక మంచం సైతం ముక్కలైంది. ఆ వెంటనే అత్త, భార్యలపై దాడి చేస్తుండగా, ఇంట్లోని అందరూ అప్రమత్తమై నిలువరించే ప్రయత్నంలో మరదలు భవాని సైతం గాయపడింది. జనాలు పోగవడంతో పరారయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఏడుకొండలు, అత్త రమణ, భార్య ధనలక్ష్మి, మరదలు భవానీలను మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడి నుంచి విజయవాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా.. ఏడుకొండలు మృతి చెందాడు. అత్త, భార్య పరిస్థితి విషమంగానే ఉందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారుల పరిస్థితి అయోమయంగా మారింది.

మృతుడు ఏడుకొండలు (పాతచిత్రం)


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని