కె.వి.ఆర్‌.కాలనీకి ఏమైంది..?
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

కె.వి.ఆర్‌.కాలనీకి ఏమైంది..?

డయేరియా అనుమానిత లక్షణాలతో అనారోగ్యం
కాలనీ పక్కనే చెత్త డంపింగ్‌ యార్డు
ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, రామవరప్పాడు

ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

విజయవాడ శివారు ఎనికేపాడు గ్రామంలో వ్యాధుల భయం నెలకొంది.  కె.వి.ఆర్‌.కాలనీలో ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాల బారినపడుతూ ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా కాలనీకి చెందిన కె.లీల (50) ఇవే లక్షణాలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కాలనీ పక్కనే డంపింగ్‌యార్డు ఉండడం.. మరోవైపు భూగర్భ జలం కలుషితమై ఉంటుందన్న భయం కాలనీవాసుల్లో ఉంది. ఈ కాలనీలో 80 ఇళ్లున్నాయి. కలుషిత నీరే కారణమని కాలనీవాసులు వాపోతున్నారు. అయితే.. నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించగా.. ఎలాంటి కలుషితం లేదని ప్రాథమికంగా తేలిందని గ్రామ సర్పంచి పూర్ణ చంద్రరావు తెలిపారు. అందరికీ ఒకేలాంటి లక్షణాలు ఉండటంతో స్థానికంగా ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రస్తుతం 11 మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కాలనీలో శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సహాయం అందజేస్తున్నారు. నీరు లేదంటే ఆహారం కలుషితమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుహాసిని వెల్లడించారు. అంటువ్యాధుల నిపుణుల బృందం కాలనీకి మంగళవారం వెళ్లి కారణాలు ఏమిటనేది పరిశీలించి నివేదిక రూపొందిస్తారని ఆమె తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నేడు అంటువ్యాధుల నిపుణుల బృందం కాలనీకి రానుంది. కలుషిత ఆహారం, అనారోగ్యకరమైన పరిసరాల వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు. తాజాగా కాలనీలో చెత్తచెదారం పూర్తిగా తొలగించి శుభ్రం చేశారు. 

కాలనీలో వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న బాధితులు

యార్డులోనే తగలబెడుతూ..

కాలనీకి సమీపంలోని డంపింగ్‌ యార్డులో ఎక్కెడెక్కడి నుంచో సేకరించిన చెత్తను తెచ్చి పోస్తున్నారు. కానూరు వైపు నుంచి మొత్తం చెత్త తీసుకొచ్చి ఇక్కడే పడేస్తుంటారు. చెత్తను ఇక్కడే తగలబెడుతుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని